నైజీరియా చర్చిలో మారణహోమం.. చర్చిలో కాల్పులు జరిపిన ఉన్మాది
Nigeria Church Attack: 50 మందికి పైగా మృత్యువాత.. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులే
Nigeria Church Attack: నైజీరియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ చర్చిపై కాల్పులు, బాంబు దాడులతో మారణహోమం సృష్టించారు. ఈ ఘటనలో 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులే ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఓండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఈ ఘటన జరిగింది. ఆదివారం కావడంతో ప్రార్థనల కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ప్రాణనష్టం భారీగా జరిగింది. ఘటన తర్వాత చర్చి ప్రధాన పాస్టర్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మృతదేహాలు, చెల్లాచెదురుగా పడిన అవయవాలతో చర్చి భీతావహంగా ఉంది. ఈ దాడిలో ఎంతమంది మరణించారన్న విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనప్పటికీ 50 మందికిపైనే ప్రాణాలు కోల్పోయినట్టు నైజీరియా లోయర్ లెజిస్లేటివ్ చాంబర్ సభ్యుడు అడెలెగ్బె టిమిలెయిన్ తెలిపారు.
ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెదర్ ప్రాంతానికి చెందిన పిశాచాలు మాత్రమే ఇటువంటి మారణహోమాన్ని సృష్టించగలవని మండిపడ్డారు. ఏది ఏమైనా, ఈ దేశం ఎప్పటికీ దుష్టులకు లొంగదని తేల్చి చెప్పారు. చీకటి ఎప్పటికీ కాంతిని పారదోలలేదన్నారు. చివరికి నైజీరియానే గెలుస్తుందని బుహారీ పేర్కొన్నారు. మరోవైపు చర్చిపై దాడికి ఇప్పటివరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు. నైజీరియాలో అత్యంత శాంతియుత రాష్ట్రాలలో ఒకటిగా ఖ్యాతికెక్కిన ఓండోలో జరిగిన ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది.