నెక్ట్స్‌ లెవల్‌కు ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. రంగంలోకి అమెరికా హిమార్స్‌..

Himars: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం తీరు మారుతోంది. పాశ్యాత్య దేశాలు అందిస్తున్న అత్యాధునిక ఆయుధాలతో రష్యాపై దీటుగా ఉక్రెయిన్‌ పోరాడుతోంది.

Update: 2022-06-06 16:00 GMT

నెక్ట్స్‌ లెవల్‌కు ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. రంగంలోకి అమెరికా హిమార్స్‌..

Himars: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం తీరు మారుతోంది. పాశ్యాత్య దేశాలు అందిస్తున్న అత్యాధునిక ఆయుధాలతో రష్యాపై దీటుగా ఉక్రెయిన్‌ పోరాడుతోంది. 101 రోజులుగా సాగుతున్న ఈ యుద్ధాన్ని మరో లెవల్‌కు తీసుకెళ్లేందుకు ఉక్రెయిన్‌ సిద్ధమవుతోంది. డాన్‌బాస్‌ ప్రాంతాల్లో కోల్పోయిన భూ భాగాలతో పాటు మాస్కో సేనలను చావు దెబ్బ కొట్టేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు సాధారణ ఆయుధాలను ఇచ్చిన అమెరికా ఇప్పుడు రష్యాపై దాడులే లక్ష్యంగా అడ్వాన్స్‌డ్‌ రాకెట్‌ సిస్టమ్‌ హిమార్స్‌ను ఉక్రెయిన్‌కు అందిస్తోంది. ఈ రాకెట్లతో రష్యా భూభాగంలోని ప్రధానమైన చమురు, గ్యాస్‌ నిల్వలపై దాడికి అవకాశం లభిస్తుంది. అదే జరిగితే రష్యాకు ఊహించని నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఉక్రెయిన్‌ యుద్ధం 101 రోజులకు చేరుకుంది. ఇప్పటివరకు 20 శాతం భూభాగాన్ని కోల్పోయినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. మరోవైపు మరిన్ని ప్రాంతాలపై పట్టుకు రష్యా సైన్యం దాడులను ఉధృతం చేసింది. మరోవైపు రష్యా గెలుపును అడ్డుకునేందుకు అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. జెలెన్‌స్కీ చేతికి మరిన్ని ఆయుధాలను ఇస్తున్నాయి. ఇటీవల అమెరికా ప్రకటించిన 4వేల కోట్ల డాలర్ల ప్యాకేజీలో భాగంగా అడ్వాన్స్‌డ్‌ రాకెట్‌ సిస్టమ్స్‌ అందించేందుకు అగ్రరాజ్యాధినేత బైడెన్‌ ఓకే చెప్పారు. ట్రక్కులో అమర్చిన ఆరు రాకెట్లతో కూడిన కంటైన్‌ను మోసుకెళ్లగలిగే హైమొబైలిటీ ఆర్టిలరీ రాకెట్‌ సిస్టమ్‌-హిమార్స్‌ను ఉక్రెయిన్‌కు ఇవ్వనున్నారు. దీంతో పాటు హెలికాప్టర్లు, జావెలిన్‌ యాంటీ ట్యాంకు ఆయుధ వ్యవస్థలు, వ్యూహాత్మక వాహనాలు, ఇతర ఆయుధాలను పంపనున్నారు.

హిమార్స్‌ యుద్ధంలో కీలక పాత్ర పోషించనున్నది. 300 కిలోమీటర్ల దూరంలోని రష్యా లక్ష్యాలను గురిపెట్టి ఖచ్చితంగా దాడి చేయనున్నది. మధ్యస్థ శ్రేణికి చెందిన రాకెట్లు భారీ విధ్వంసాన్నే సృష్టించనున్నాయి. రష్యాకు చెందిన చమురు, గ్యాస్‌ నిల్వలన్నీ ప్రధానంగా ఉక్రెయిన్ తూర్పు సరిహద్దుకు సమీపంలోనే ఉంటాయి. ఉక్రెయిన్‌ చేతికి హిమార్స్‌ అందితే రష్యా చమురు, నిల్వలపై దాడులు చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే రష్యాకు భారీ నష్టమే జరగనున్నది. ఇప్పటివరకు రష్యా దాడుల్లో భారీ ఆయుధ, చమురు నిల్వలను ఉక్రెయిన్‌ పోగొట్టుకుంది. హిమార్స్‌ రాకెట్లతో రష్యాపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది. సరిహద్దులతో పాటు దేశంలో పలు ప్రాంతాల్లో తిష్ఠవేసిన రష్యన్‌ సేనలపైనా ఉధృతమైన దాడులకు ఉక్రెయిన్ దిగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రష్యాకు చమురు నిల్వలపై ఉక్రెయిన్‌ దాడి చేస్తే ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లనున్నది. పుతిన్‌ను దెబ్బకొట్టేందుకు కట్టడి చేసేందుకు అమెరికా, ఐరోపా దేశాల సమాఖ్య దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం చేస్తున్న దేశాలపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆయుధాల సరఫరాను ఆపేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. హిమార్స్‌ రాకెట్లు ఉక్రెయిన్‌కు ఇస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది. మాస్కో అధినేత ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. పుతిన్‌కు చిర్రెత్తి.. అణుబాంబులతో దాడి చేసినా.. చేస్తారని.. మరికొందరు అనుమానిస్తున్నారు. అయితే అమెరికా మాత్రం మరోలా వాదిస్తోంది. ఉక్రెయిన్ తనను తాను కాపాడుకునేందుకు మాత్రమే తాము ఆయుధాలను ఇస్తున్నట్టు అగ్రరాజ్యం చెబుతోంది. తాజాగా ఇచ్చిన రాకెట్లు కూడా కేవలం ఉక్రెయిన్‌లో దాడులకోసమే ఇచ్చినట్టు అమెరికా చెబుతోంది. తాము రష్యాపైదాడులను కోరుకోవడం లేదని అమెరికా చెబుతోంది. అయితే ఉక్రెయిన్ యుద్ధానికి కర్త, కర్మ, క్రియ అన్నీ అమెరికానేనని ఎప్పటి నుంచో రష్యా ఆరోపిస్తంది. ఆయుధాలను ఇవ్వడంతో పాటు ప్లాన్‌వేసి మరీ అమెరికానే రష్యాపై దాడి చేయిస్తున్నట్టు రష్యా భావిస్తోంది.

ఉక్రెయిన్ యుద్ధానికి ఆయుధ, ఆర్థిక, మేథో సాయమందిస్తున్న అమెరికా రష్యాపై భారీ ఆంక్షలను విధించింది. రష్యాపై మొత్తం 10వేల 540 ఆంక్షలను వివిధ దేశాలు విధించాయి. ఇందులో అత్యధికంగా అమెరికా ఆంక్షలే ఉన్నాయి. రష్యాపై అమెరికా 2వేల 26 ఆంక్షలను విధించగా.. కెనడా 14వందల 63 ఆంక్షలు, స్విట్జర్లాండ్‌ 13వందల 61, బ్రిటన్‌ 13వందల 60, ఐరోపా సమాఖ్య 11వందల 99, ఫ్రాన్స్‌ 11,79, ఆస్ట్రేలియా 11వందల 50, జపాన్‌ 802 ఆంక్షలను విధించాయి. ఆంక్షలతో పుతిన్‌ను అమెరికా, పాశ్చాత్య దేశాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 101 రోజుల యుద్ధంలో రష్యా కీలకమైన మరియూపోల్‌, ఖేర్సన్‌ ప్రాంతాలను తన గుప్పిట్లోకి తీసుకుంది. క్రిమియాకు లైన్ క్లియర్‌ చేసుకుంది. మరియూపోల్‌కు స్వేచ్ఛ లభించిందని పుతిన్‌ ఇప్పటికే ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో తమ పాలనను ప్రాంభించేందుకు ఏర్పాట్లు కూడా సాగుతున్నట్టు తెలుస్తోంది. 101 రోజులుగా సాగుతున్న యుద్ధానికి తెర దించాలంటే పుతిన్‌ స్వయంగా చర్చలకు రావాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ డిమాండ్‌ చేస్తున్నారు. దౌత్య చర్చలతోనే యుద్ధానికి ముగింపు పలకాలని కోరుతున్నారు. 

Tags:    

Similar News