మ్యాజిక్ ఫిగర్‌కు చేరువైన బైడెన్.. అధ్యక్ష పీఠానికి దాదాపు దూరమైన ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో చివరకు బైడెన్ పైచేయి సాధించారు. అధ్యక్ష పీఠానికి ఆరు ఓట్ల దూరంలో నిలిచారు. మొదటి నుంచి చాలా రాష్ట్రాల్లో ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్న బైడెన్ ఇప్పటివరకు 264 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. మరో ఆరు ఓట్లు సాధిస్తే బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టనున్నారు.
అయితే ఇప్పటివరకు 45 రాష్ట్రాల్లో కౌంటింగ్ పూర్తవగా మరో ఐదు రాష్ట్రాల కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ ఐదు రాష్ట్రాల్లో అమెరికాకు కాబోయే అధ్యక్షుడిని డిసైడ్ చేయనున్నాయి. ఇందులో నెవాడాలో ఆధిక్యంలో ఉన్న బైడెన్ ఆ రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటే మ్యాజిక్ ఫిగర్‌ను చేరువవుతారు. అయితే అక్కడ స్వల్ప ఆధిక్యం మాత్రమే ఉండటంతో మరో నాలుగు రాష్ట్రాల్లో ట్రంప్ లీడ్‌లో ఉండటంతో ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.
నిన్న స్వింగ్ స్టేట్స్‌లో కనిపించిన ట్రంప్ హవా తగ్గింది. మిచిగాన్, విస్కాన్సిన్ రాష్ట్రాలను బైడెన్ కైవసం చేసుకున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఊహించని విధంగా బైడెన్ విజయం సాధించటంతో ట్రంప్ అధ్యక్ష పదవికి దూరమయ్యే పరిస్థితి తలెత్తింది. మిగిలిన ఐదు రాష్ట్రాల్లో నార్త్ కరోలినా, జార్జియా,పెన్సిల్వేనియాలో ట్రంప్ ఆధిక్యం కనిపిస్తుండగా అరిజోనా, నెవాడాలో బైడెన్ ఆధిక్యంలోకి వచ్చారు.