రాజ్యసభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వైసీపీ ముందుజాగ్రత్త చర్యలు మొదలుపెట్టింది. తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురికాకుండా కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు జగన్. ఇప్పుటికే కీలక ఎమ్మెల్యేలను క్యాంప్‌కు తరలించేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా తమ అభ్యర్థికే ఓటు వేస్తారని గట్టిగా చెప్తున్నారు వైసీపీ నేతలు.
రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందే వైసీపీ తమ రాజ్యసభ అభ్యర్థిగా నెల్లూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ప్రకటించారు వైసీపీ అధినేత జగన్. అప్పటి నుంచి పార్టీలో ఉన్న 44 మంది ఎమ్మెల్యేలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. చివరి నిమిషంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి ఎక్కడ లాగేస్తారోనన్న భయం వైసీపీ నేతలను వెంటాడుతోంది. దీంతో ఒక్క ఎమ్మెల్యే కూడా చేజారిపోకుండా అందరినీ క్యాంపునకు తరలించారు అగ్రనేతలు.
ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలను ఢిల్లీ శివార్లలోని ఓ రిసార్ట్‌లో ఉంచారట. ఇంకొందరిని బ్యాచ్‌ల వారీగా ఫారిన్ టూర్లకు పంపించి ఎన్నికల నాటికి తిరిగొచ్చేలా ప్రణాళికలు రెడీ చేశారు వైసీపీ అగ్రనేతలు. ఇక పార్టీకి పూర్తిస్థాయి నమ్మకందారులైన ఎమ్మెల్యేలకు మాత్రం ఫుల్ ఫ్రీడం ఇచ్చారు. వాళ్లంతా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు చేపడుతూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు జగన్.
ఐతే.. ఇప్పటికే వైసీపీ నుంచి టీడీపీలోకి దూకిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురిని తిరిగి పార్టీలోకి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది వైసీపీ. వీరితో పాటు మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఎన్నికల్లో తమ అభ్యర్థికి ఓటేస్తారని అధికార టీడీపీని ఆందోళనకు గురిచేసేలా ఎదురుదాడి చేస్తున్నారు వైసీపీ నేతలు. దుష్టులకు దూరంగా ఉండాలనే తమ పార్టీ ఎమ్మెల్యేలను జాగ్రత్తగా చూసుకుంటున్నామని చెప్తున్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ.