ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ చేపట్టిన పాదయాత్ర 900 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నేషనల్ మీడియాతో మాట్లాడిన జగన్ 2019 ఎన్నికల్లో బీజేపీ తో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాకపోతే తనకు ముందుగా బీజేపీ ఓ హామీ ఇవ్వాలని సూచించారు. ప్రత్యేక హోదా ఇస్తే మరోమారు ఆలోచించకుండా బీజేపీతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. చంద్రబాబు అసత్య ప్రచారాలతో మభ్యపెడుతున్నారని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4ఏళ్లు అవుతున్నా ఏపీ రాజధాని నిర్మాణం ప్రారంభం కాలేదని .. రాజధాని పేరిట చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు.
అయితే జగన్ చేసిన ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్ పై మిగిలిన రాజకీయపార్టీలు మండిపడుతున్నాయి. ఇన్నిరోజులు గుర్తుకు రానీ స్పెషల్ స్టేటస్ అంశం ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందని దెప్పిపొడుస్తున్నారు. ఇప్పుడు దీన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి జగన్ కొత్త అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. అస్త్రం పాతదే అయినా కొత్తగా ప్రయోగించాలనేదే జగన్ అభిమతం.
తాజాగా వైసీపీ ఎంపీ విజయ్ సాయిరెడ్డి స్పందించారు. ప్రత్యేకహోదా కోసం తమ పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని గంభీరంగా ప్రకటించారు. అయితే ఎంపీల రాజీనామా పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
నిన్నమొన్నటి వరకు ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ తో కలిసి పనిచేస్తామన్న వైసీపీ సడన్ గా ఎంపీ లా రాజీనామా ప్రస్తావన ఎందుకు తెస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు 2017 బడ్జెట్ సెషన్ లో ప్రత్యేక హోదాపై తమ పార్టీ చెందిన ఎంపీలు రాజీనామా చేస్తామని జగన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అంటున్నారు.
ఎంపీల రాజీనామా వంటి ప్రధాన నిర్ణయాన్ని ఏడాదిన్నరగా వాయిదా వేశారు. అసలే కేసుల ఊబిలో ఉన్న తనపై కేంద్రం కక్ష సాధింపులకు పాల్పడుతుందేమోనన్న ఆందోళనలో జగన్ ఉన్నాడని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయం పడుతున్నారు. ఎన్నికల సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి ఎంపీలు రాజీనామా చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకే జగన్ యూటర్న్ తీసుకొని రాజీనామా అంశాన్ని తెరపైకి తెచ్చారని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.