పాదయాత్రలో జగన్ ఆపరేషన్ ఆకర్ష్..వైసీపీలోకి క్యూకట్టనున్న నేతలు..?
ఏపీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. పార్టీలన్నీ సన్నాహాల్లో ఉన్నాయి. ఓవైపు హోదా ఉద్యమంలో బిజీగా గడుపుతూనే మరోవైపు సొంత ఇంటిని చక్కదిద్దుకోవడంపై కూడా దృష్టిపెట్టాయి. అందుకు తగ్గట్టుగా నియోజకవర్గాల వారీగా పరిస్థితిని తమకు సానుకూలంగా మలచుకోవాలనే ప్రయత్నంలో జగన్ తలామునకలైనట్లు సమాచారం. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను అభ్యర్థుల విషయంలో ముందస్తుగా సిద్ధం చేసుకోవాలనే లక్ష్యంతో జగన్ ఉన్నట్లు ఆ పార్టీనేతలు గుసగుసలాడుతున్నారు. దానికి తగ్గట్టుగా ఇతర పార్టీల నుంచి చేరడానికి సంకేతాలు ఇచ్చిన వారిని వెంటనే చేరాలని సూచించినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి గోదావరి జిల్లాల్లో యాత్ర ముగిసే లోగా పలువురు కీలక నేతలకు ముహూర్తాలు సిద్ధం చేసే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఏపీలో అధికారం సాధించాలంటే ఈ మూడు జిల్లాలే కీలకం.గత ఎన్నికల నాటి అనుభవాలతో జగన్ వచ్చే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అదే సమయంలో గడిచిన రెండు నెలలుగా ఏపీలో తెలుగుదేశం గ్రాఫ్ పడిపోతోందనే అంచనాలతో వైసీపీ వైపు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. దానికి తగ్గట్టుగానే కొందరు కీలక నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా నైతికంగా మరింత పట్టు సాధించే యోచనలో జగన్ శిబిరం ఉన్నట్టు కనిపిస్తోంది. గడిచిన రెండేళ్లుగా ఊగిసలాటలో ఉన్న చాలామంది నేతలకు జగన్ క్యాంప్ నుంచి ఇప్పటికే సంకేతాలు అందినట్టు చెబుతున్నారు. సమయం మించి పోయిన తర్వాత పార్టీలో చేరినప్పటికీ సీటు గ్యారంటీ ఉండదు కాబట్టి రాబోయే నెలన్నర రోజుల్లోనే నిర్ణయం తీసుకోవాలని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో టీడీపీ నుంచి కూడా ఐదుగురు ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు గుంటూరు జిల్లా నుంచి మరొకరు తూర్పు గోదావరి జిల్లా నుంచి ఉన్నట్టు సమాచారం. తూగో జిల్లాకు చెందిన మరో ఎంపీ కూడా జగన్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు లీకులు వస్తున్నాయి. వారికితోడుగా భారీ సంఖ్యలో మాజీలుంటారని చెబుతున్నారు.
ఇలాంటి నేతలంతా చేరిక విషయంలో వీలయినంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని వైసీపీ నేతలు ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఈనెల 19న జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోబోతున్నట్టు నిర్ధారించారు. ఆయనకు తోడుగా అదే జిల్లాకు చెందిన వంగా గీత కూడా క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన హరిరామజోగయ్య తనయుడు కూడా వైసీపీ లో చేరేందుకు మంతనాలు జరిపారని పొలిటికల్ వర్గాలు చెబుతున్నాయి.మరికొందరు నేతలు కూడా అందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే కీలకనేతలు కొందరు తమ సన్నద్ధత ప్రకటించాలని వైసీపీ ఆశిస్తోంది. అలాంటి వారిలో ఎవరెవరు ఖాయం అవుతారన్నది త్వరలో తేలబోతోంది.