వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలపై వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. అభ్యర్ధుల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్న జగన్ వీక్‌గా ఉన్నచోట నిర్ధాక్షిణ్యంగా నియోజకవర్గ ఇన్‍ఛార్జులను మార్చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో మార్పులు చేర్పులు చేపట్టిన జగన్ ఇప్పుడు గుంటూరు జిల్లాపై ఫోకస్ పెట్టారు.
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అభ్యర్ధుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎక్కడైనా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బలహీనంగా ఉన్నారనిపిస్తే నిర్దాక్షిణ్యంగా మార్చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో నియోజకవర్గాల ఇన్‌ఛార్జులను మార్చేసిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు గుంటూరు జిల్లాపై దృష్టిపెట్టారు. ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా నాలుగైదు నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జులను మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా తాడికొండలో క్రిస్టియానాను పక్కనబెట్టి అక్కడ డాక్టర్ శ్రీదేవిని బరిలోకి దింపేందుకు రంగంసిద్ధమైంది. ఇక పెదకూరపాడులో మనోహర్‌నాయుడును తప్పించి అదే సామాజిక వర్గానికి చెందిన శంకర్రావుకు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అలాగే వేమూరులో మేరుగ నాగార్జునను పక్కనబెట్టి మాజీ ఐపీఎస్ బాబును రంగంలో దింపాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇక గుంటూరు-2 నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా మాజీ అడిషనల్ డీజీ ఏసురత్నాన్ని నియమించడంతో అప్పటివరకు సమన్వయకర్తగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు.
మొత్తానికి గుంటూరు జిల్లాలో వైసీపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించి జగన్మోహన్‌రెడ్డి దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. అయితే నాలుగున్నరేళ్లుగా పార్టీని అంటిపెట్టుకున్న నేతలను ఎన్నికల ముందు సడన్‌గా మార్చడంపై తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి వ్యక్తమవుతోంది. దాంతో కొందరు పార్టీకి గుడ్‌బై చెప్పేస్తుండగా, మరికొందరు సమయం కోసం వేచిచూస్తున్నారు.