ఏపీ రాజకీయం విమర్శలు ప్రతి విమర్శలతో వేడెక్కుతుంది. ఏపీకి ప్రత్యేకహోదా కావాలంటూ ఏపీకి చెందిన టీడీపీ, వైసీపీ , జనసేన, లెఫ్ట్ పార్టీలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. వైసీపీ నేతలు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. టీడీపీ నేతలు పార్లమెంట్ లో ఆందోళన చేస్తున్నారు. ఈనేపథ్యంలో గుంటూరు జిల్లా తెనాలిలోని సంగం జాగర్లమూడి వద్ద మీడియాతో మాట్లాడిన జగన్ సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు.
సీఎం చంద్రబాబు పుట్టింది నాలుగో నెల.. 20వ తేదీ. అంటే ఆయనో 420. హిట్లర్ కూడా అదే తేదీన పుట్టారు. చంద్రబాబు, హిట్లర్ ఇంచుమించు ఇద్దరి మనస్థత్వాలు ఒకటే. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి.. అదే నిజం అని నమ్మించడానికి గోబెల్స్ ప్రచారాలు చేస్తుంటారు. అందుకు మీడియాను వాడుకుంటారు' అని జగన్ ఆరోపించారు. చంద్రబాబు ఏదైనా బావి చూసుకుని దూకితే... రాష్ట్రానికి పట్టిన శని వదులుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవని పార్టీలు, నేతలు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవని పార్టీలు, నేతలు అంటూ ఎవరూ లేరని, అందుకే ఆయన్ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని అన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై టీడీపీ మంత్రి దేవినేని జగన్ పై నిప్పులు చెరిగారు. కోట్ల రూపాయల ప్రజల సొమ్మును లూటీ చేసిన జగన్ పార్లమెంట్ లో ప్రత్యేకహోదా గురించి మాట్లాడకుండా డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. చంద్రబాబుపై జగన్ చేసిన విమర్శలు సహా మాట్లాడిన భాష సరికాదని దేవినేని అన్నారు . జగన్ అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు వైసీపీ ఎంపీలతో జగన్ లాబీయింగ్ లకు పాల్పడుతున్నారని సూచించారు. కేసుల మాఫీపై లాబీయింగ్ చేసుకునేందుకే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సహా మిగతా సభ్యులను రాజీనామా చేయించలేదని మండిపడ్డారు. వైసీపీ ఎంపీలు ఏపీ భవన్‌లో నాలుగు గోడల మధ్య నిరసన కాకుండా ప్రధాని ఇంటి ముందు, ఢిల్లీ పురవీధుల్లో ఆందోళన చేయాలన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేసిన జగన్‌కు చంద్రబాబుపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. మోడీని విమర్శిస్తే జైలుకు తిరిగి వెళ్లాల్సి వస్తుందనే భయంతో మాట్లాడటం లేదన్నారు.