తన భార్య వైఎస్ భారతి పేరును ఈడీ ఛార్జిషీట్‌లో చేర్చినట్టు పత్రికల్లో కథనాలు రావడం పట్ల వైఎస్‌ఆర్సీపీ నేత వైఎస్ జగన్ స్పందించారు. కొన్ని పత్రికల్లో తన భార్య పేరును ఈడీ చార్జిషీటులో పొందుపర్చినట్లు వచ్చిన వార్తలను చూసి షాకయ్యానని జగన్ ట్వీట్ చేశారు. రాజకీయాలు ఈ స్థాయికి దిగజారడం చూస్తుంటే బాధ కలుగుతోందని, చివరికి కుటుంబ సభ్యులను కూడా వదలడం లేదని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన భార్య వైఎస్ భారతి పేరును కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ ఛార్జిషీట్‌లో చేర్చినట్టు కథనాలు వెలువడ్డాయి. భారతి సిమెంట్స్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆమెను నిందితురాలిగా చేర్చినట్టు సమాచారం. ఇదే కేసులో సీబీఐ ఛార్జిషీట్‌లో మాత్రం భారతి పేరు లేకపోవడం గమనార్హం. తొలిసారి ఈడీ ఛార్జిషీట్‌లో ఆమె పేరున్నట్టు వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి. వైఎస్ భారతితోపాటు విజయసాయి రెడ్డి, సిలికాన్ బిల్డర్స్, సండూరు పవర్, క్లాసిక్ రియాల్టీ, సరస్వతి పవర్, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వి.డి.రాజగోపాల్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపానందం పేర్లను ఈడీ ఛార్జిషీట్‌లో పేర్కొన్నట్టు తెలుస్తోంది.