వైసీపీ ఎల్పీ కార్యాలయంలో బీజేపీ నేత ప్రత్యక్షమవ్వడం కలకలం రేపుతుంది. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ నేతల, ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ ఆఫీస్ రూంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు ప్రత్యేక్షమయ్యారు. ఓ ఛానల్ నిర్వహించిన డిబెట్ లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. వైసీపీ నుంచి పోటీ చేసి, టీడీపీలో ఉన్న నేతలదంరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పార్టీలు మారే నాయకులకోసం ప్రత్యేక చట్టం తేవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సదరు ఛానల్ యాంకర్ మీరు వైసీపీ ఆఫీస్ లో ఎందుకు ఉన్నారని ప్రశ్నించడంతో... తాను వైసీపీ కార్యాలయంలో ఉంటే తప్పేంటని సమర్ధించుకున్నారు. వైసీపీ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడటం కేవలం యాదృచ్ఛికమేనన్న ఆయన ఫిరాయింపులపై చేసిన వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయానికి ప్రతిబింబం కాదని అన్నారు. తాను వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచుండి, ఆపై టీడీపీలో చేరాలని భావిస్తే రాజీనామా చేసుండేవాడినని, అదే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. అవసరాన్ని బట్టి పార్టీ మారే వ్యక్తిని కాదని చెప్పారు.
ఇదిలా ఉంటే జగన్ పాదయాత్ర పై విష్ణుకుమార్ రాజు ప్రశంసించిన విషయం తెలిసిందే. జగన్ పాదయాత్ర దృఢ సంకల్పంతో చేస్తున్నారని ..ఏదో ఒకటీ రెండు రోజుల పాటు పాదయాత్రను చేయడం వేరు.. రోజులు, వారాలు, నెలల తరబడి పాదయాత్రను కొనసాగించడం వేరు అని.. అంటూ పాదయాత్రను చేస్తున్న జగన్ ను అభినందించారు రాజు.
ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న జగన్ ను కలవాలని తన మామ తనను చాలా సార్లు అడిగారని అన్నారు. పాదయాత్ర లో భాగంగా మే నెలలో విశాఖ పట్నం వచ్చే అవకాశం ఉందని.. అప్పుడు తాము కూడా కలుస్తామని.. ప్రజా సమస్యలు తెలుసుకొంటూ పాదయాత్రను సాగిస్తున్న జగన్ ను కలిసి అభినందిస్తామని విష్ణుకుమార్ రాజు చెప్పుకొచ్చారు.