బీజేపీ… టీడీపీ. ఒకప్పుడు ప్రాణమిత్రులు. ఇప్పుడేమో రాజకీయ శత్రువులు. టెన్నిస్ లో లియాండర్ పేస్, మహేష్ భూపతిల స్నేహంలా ఉంటుందీ.. ఈ రెండు పార్టీల కథ. ఎందుకంటే.. ఎప్పుడు కలుస్తారో తెలియదు.. ఎప్పుడు విడిపోతారో తెలియదు.. ఈ పరిణామాలకు ఎలాంటి పరిస్థితులు కారణంగా ఉంటాయో కూడా తెలియదు. కానీ.. కలిసున్నపుడు ప్రాణానికి ప్రాణంగా నడుస్తారు.. విడిపోతే అంతకు మించిన శత్రుత్వాన్ని ప్రదర్శిస్తారు.
ఒకప్పుడు కూడా.. ఈ రెండు పార్టీలు కలిసే పని చేశాయి. కానీ.. కాలక్రమంలో వాజ్ పేయి ప్రభుత్వం చివరి దశలో ఉన్నపుడు.. అంతర్గత కలహాల కారణంగా మొదటిసారి విడిపోయాయి. అప్పుడు ఏం జరిగిందో అందరం చూశాం. 2004లో వాజ్ పేయి ప్రభుత్వం.. దేశం వెలిగిపోతోందంటూ ఎంత ప్రచారం చేసుకున్నా.. మరోసారి అధికారాన్ని సొంతం చేసుకోలేకపోయింది. అప్పుడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా టీడీపీ ఓడిపోవాల్సి వచ్చింది.
ఇప్పుడు మరోసారి బీజేపీకి టీడీపీ కటీఫ్ చెప్పింది. ఇంకో మాట చెప్పాలంటే.. కటీఫ్ చెప్పాల్సి వచ్చింది. మరోవైపు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. 2014లో దేశ వ్యాప్తంగా బీజేపీ 282 పార్లమెంట్ స్థానాలను సొంతం చేసుకుని బలమైన పార్టీగా అవతరిస్తే.. ఈ నాలుగేళ్లలో జరిగిన ఉప ఎన్నికల్లో ఏకంగా 10 సీట్లలో ఓడిపోయి 272 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. తగ్గుతున్న బలాన్ని చూసి ఆ పార్టీ కూడా ఆందోళన చెందుతోంది.
దీంతో.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో.. 2004 నాటి ఫలితాలే పునరావృతం అవుతాయని సెంటిమెంట్ పండితులు జోస్యం చెబుతున్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు, ప్రజల మనోభావాలు కూడా.. అందుకు తగినట్టే ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. దీంతో.. వచ్చే ఎన్నికల నాటికి ఏం జరగబోతోంది? నిజంగానే బీజేపీకి, టీడీపీకి ఇది కష్టకాలమా? చరిత్ర పునరావృతం కాక తప్పదా? ఇంకో ఏడాది ఆగితే తప్ప.. ఈ చిక్కు ముడి వీడదు.