రెండేళ్లుగా యూకేకు భారత పర్యాటకుల తాకిడి భారీ స్థాయిలోతగ్గిపోయింది. ఇక బ్రిటన్ తో పోలిస్తే పక్కన ఉన్న ఫ్రాన్స్ కు వెళ్తున్న ఇండియన్స్ సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే యూకేలోని మేధోవర్గం వీసా ధరలను తగ్గించాలని చసూచిస్తోంది. భారతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు వీసా ధరలను తగ్గించాలని భావిస్తోంది. ఈ మేరకు రాయల్ కామన్‌వెల్త్ సొసైటీ(ఆర్‌సీఎస్) దీనిపై అధ్యయనం చేసి ఈ విధంగా సూచనలు చేసింది.
ఆర్‌సీఎస్ విడుదల చేసిన ‘బ్రిటన్ అండ్ ఇండియా: బిల్డింగ్ ఏ న్యూ వీసా పార్ట్‌నర్‌షిప్’ నివేదిక ప్రకారం చూసుకున్నట్లైతే.. 2016 సంవత్సరంలో ఇండియా నుంచి 6లక్షల మంది భారత పర్యాటకులు ఫ్రాన్స్‌కు వెళ్లారు. అది యూకేతో పోల్చి చూసుకుంటే ఈ సంఖ్య 1,85,000 ఎక్కువ అన్నమాట. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 2016లో యూకేలో భారత పర్యాటకుల సంఖ్య 1.73శాతం తగ్గింది. ఫ్రాన్స్‌లో మాత్రం 5.3శాతం పెగుతూ వచ్చింది. అయితే వీసా ధరను తగ్గిస్తే భారత పర్యాటకులను ఆకట్టుకోవచ్చని నివేదిక పేర్కొంది.
దీని కోసం సరికొత్త యూకే-ఇండియా వీసా ఒప్పందాన్ని ప్రతిపాదన తీసుకొచ్చింది. దాని ప్రకారం.. ప్రస్తుతమున్న రెండేళ్ల వీసా ధరను 388 పౌండ్ల నుంచి 89 పౌండ్లకు తగ్గించాలని నివేదిక సూచించింది. ఇలా చేయడం ద్వారా వాణిజ్యపరంగా, పర్యాటక పరంగా దేశం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొంది. అంతేగాక ఇరుదేశాల మధ్య వ్యాపార బంధాలు బలోపేతమవుతాయని మేధోవర్గం అభిప్రాయం వ్యక్తం చేసింది.