టీటీడీ చరిత్రలోనే పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 9 నుంచి17 వరకు 9 రోజుల పాటు స్వామివారి దర్శనాన్ని నిలిపివేసింది. తిరుమలలో 12 ఏళ్లకోసారి నిర్వహించే మహాసంప్రోక్షణపై చర్చించిన పాలక కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. మహా సంప్రోక్షణ జరపాలన్న ఆగమ పండితుల సలహా మేరకు ఆగస్టు 12 నుంచి 16 వరకు అష్టబంధన, బాలాలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందుకోసం 11న మహా సంప్రోక్షణకు అంకురార్పణ జరగనుంది. 9వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు వరకు కొండపైకి భక్తుల రాకను నిలిపివేస్తున్నట్టు సభ్యులు ప్రకటించారు. దీంతో పాటు కొండపైకి వచ్చే అన్ని మార్గాలను నిలిపివేస్తున్నట్టు తెలిపారు.
అయితే ఒకేసారి తొమ్మిది రోజుల పాటు భక్తులను కొండపైకి అనుమతించకపోవడంపై తీవ్ర స్ధాయిలో విమర‌్శలు రావడంతో టీటీడీ వెనక్కు తగ్గింది. కొండపైకి వచ్చే అన్ని మార్గాలను తెరచి ఉంచుతామన్న పాలకమండలి దర్శనంపై మాత్రం ఆంక్షలు అమలవుతున్నాయని తెలిపింది. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించడం కష్టమవుతుందనే కారణంతోనే స్వామి దర్శనానికి విరామం ఇచ్చినట్టు టీటీడీ ప్రకటించింది.