నేను క్రిస్టియన్‌నే....స్వయంగా చెప్పుకున్న ఎమ్మెల్యే అనిత

Update: 2018-04-21 08:40 GMT

టీటీడీ నూతన పాలక మండలి నియామకం వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఆశావహులు పదవులు దక్కక కొట్లాడుకుంటుంటే పదవులు దక్కించుకున్న వారేమో అన్యమత వివాదాలలో చిక్కుకుంటున్నారు. వారం క్రితం టీటీడీ పాలక మండలి అధ్యక్షుడిగా నియమితులైన పుట్టా సుధాకర్ యాదవ్ క్రైస్తవుడనే వివాదం చల్లారక ముందే నూతన పాలక మండలిలో చోటు దక్కించుకున్న పాయకరావు పేట ఎమ్మెల్యే అనిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమె గతంలో మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత గతంలో ఓ ముఖాముఖిలో మాట్లాడుతూ తాను క్రిస్టియన్ అని చెప్పారు. తన వెంట ఎల్లపుడూ బైబిల్ ఉంటుందని అనిత అన్నారు. తన బ్యాగ్‌లో, ప్రయాణించే కారులో బైబిల్ ఉంటుందని బైబిల్ లేకుండా తాను గడప దాటి బైటికెళ్లనని అనిత ప్రకటించారు. 

ఎమ్మెల్యే తనంతట తానుగా క్రైస్తవురాలినని ప్రకటించుకున్న తర్వాత కూడా ప్రభుత్వం హిందూ ధర్మానికి చుక్కానిలా నిలిచే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి సభ్యురాలిగా ఎంపిక చేయడం ఎంత వరకు సమంజసమని హిందూ ధార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

అనిత ఒక్కరే కాదు. ప్రస్తుతం టీటీడీ కొత్త చైర్మన్ గా నియమితులైన పుట్టా సుధాకర్ యాదవ్ కూడా క్రిస్టియన్ అనే ప్రచారం ఉంది. గతంలో ఆయన కొన్ని క్రైస్తవ కార్యక్రమాల్లో పాల్గొన్నారని అంటారు. అందుకు పలు క్రైస్తవ మత ప్రచార కార్యక్రమాల ఫ్లెక్సీలు, పోస్టర్లలో ఆయన ఫోటోలను రుజువుగా చూపిస్తున్నారు. అసలు టీటీడీ మండలి ఏర్పాటు ఆలస్యం కావడానికి పుట్టాకి క్రిస్టియన్ మిషనరీలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలే కారణమని చెబుతారు.

నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో భూమన కరణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ అయ్యారు. ఈయన నాస్తికుడు మాత్రమే కాదు సాక్షాత్తూ శ్రీనివాసుడి మీదే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే విమర్శ ఉంది. ఆ సమయంలోనే తిరుమలలో ఏడు కొండలు కాదు రెండు కొండలే అని జీవో ఇచ్చినప్పుడు పెద్ద దుమారమే చెలరేగింది. 

కొన్ని నెలల క్రితం డిప్యూటీ ఈవో స్నేహలత టీటీడీ వాహనంలో చర్చికి వెళ్లడంతో అన్యమతస్థుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వాహన వినియోగం అమెను ఈవో వివరణ కోరారు. 1989 నుంచి 2007 వరకు టీటీడీలో 37మంది అన్యమతస్తులు ఉద్యోగాలు పొందారు. 2007 లో అప్పటి టీటీడీ పాలకమండలి అన్యమతస్థుల ఉద్యోగాలపై తీర్మానం చేసింది. తీర్మానం చేసిన తర్వాత కూడా ఏడుగురు ఇతర మతస్థులు విధుల్లో చేరారు. కాగా, ఆలయాలు, ఇతర ముఖ్య విభాగాలకు అన్యమతస్థులను దూరంగా ఉంచాలని పీఠాధిపతులు డిమాండ్‌ చేస్తున్నారు.  

శ్రీనివాసుడు అందరి వాడు. నిర్మలమైన మనస్సు ఒక్కటే ఆ దేవదేవుడ్ని కొలిచేందుకు అవసరం. కులమతాలుకాదు. ఈ విషయం ఆయన భక్తులందరూ అంగీకరిస్తారు. ఆచరిస్తారు. కానీ ఆయన పేరు చెప్పుకుని తమను తాము మార్కెటింగ్ చేసుకుంటూ రాజకీయాల్లో ఓట్ల వేటను సాగిస్తున్న వారికి మాత్రం ఇవేమీ పట్టవు.

Tags:    

Similar News