టీఎస్ ఆర్టీసీలో వేతన సవరణ రగడ ఉధృతమవుతోంది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఆర్టీసీ కార్మిక సంఘాలు పోరుకు సిద్ధమయ్యాయి. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే ఈ నెల 21నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు గుర్తింపు సంఘం టీఎంయూ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది.
టీఎస్ ఆర్టీసీలో వేతన సవరణ జరగకపోవడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కొత్త పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పోరాడుతున్న నేపధ్యంలో ఆర్టీసీ యూనియన్లు కూడా ఆందోళనకు దిగాయి. ఆర్టీసీ యాజమాన్యం స్పందించకపోవడంతో బస్ భవన్‌ను వందలాది కార్మికులు ముట్టడించారు. ఆర్టీసీలో ఉద్యోగులు, కార్మికులకు భద్రత కల్పించాలని, సకాలంలో జీతాలివ్వాలని డిమాండ్ చేశారు. చీటికిమాటికీ కార్మికులు, ఉద్యోగుల మీద కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
2013కు సంబంధించిన పీఆర్సీ కాలపరిమితి 2017 మార్చి 31తో ముగిసింది. 2017 ఏప్రిల్ 1 నుంచి కొత్త వేతనాలు అమలుకావాల్సి ఉంది. దీనికోసం ఆర్టీసీ యాజమాన్యం 4 నెలల క్రితం కొత్త పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసింది. గుర్తింపు సంస్థ తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలతో కలిసి ఆర్టీసీ అధికారులు వేసిన ఈ కమిటీ ఇప్పటిదాకా రెండు సార్లు మాత్రమే సమావేశమైంది. ఎంత మేరకు వేతనాలు పెంచాలన్న దానికిపై ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదు. ఇంతవరకూ పీఆర్సీ విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. అయితే, తమ సమస్యలు పరిష్కరించాలంటూ టీఎంయూ ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. మరి దీనిపై ప్రభుత్వం స్పందిస్తుందో, లేదో చూడాలి.