ఏపీ సీఎం చంద్రబాబుకు పలువురు సినీ ప్రముఖులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విభజన హామీల అమలు కోసం సీఎం చేస్తున్న పోరాటానికి బాసటగా ఉంటామని తెలిపారు. ప్రత్యేకహోదా సాధన కోసం తమవంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఏపీకి న్యాయం కోసం కేంద్రంతో సీఎం చంద్రబాబు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలిచేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందుకు వచ్చింది. పలువురు టాలీవుడ్ ప్రముఖులు నిన్న సీఎంతో సమావేశమై సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
అఖిలపక్షం పిలుపు మేరకు తాము కూడా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని సినీ ప్రముఖులు ప్రకటించారు. ఏప్రిల్ 6 వరకు టాలీవుడ్ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రజలతోపాటు వివిధ పార్టీలు హోరుపోరు సాగిస్తుండగా ఇప్పుడు తమిళనాడు తరహాలో సినీ ప్రముఖులు స్పందించడంతో ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.