ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణ వేడుకల్లో అపశ్రుతి

Update: 2018-03-31 04:41 GMT

కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. మరికాసేపట్లో కళ్యాణం జరుగుతుందనగా కురిసిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వేదిక దగ్గర ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు నేలకూలాయి. అకాల భారీవర్షం కారణంగా కళ్యాణోత్సవాన్ని చూసేందుకు వచ్చిన ముగ్గురు చనిపోగా మరో 50 మందికి పైగా గాయపడ్డారు.

కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీసీతారామ కళ్యాణం చూసేందుకు వచ్చిన భక్తులను వడగళ్ల వాన వణికించింది. హఠాత్తుగా ప్రారంభమైన ఈదురుగాలులు, వడగళ్ల వాన ధాటికి కల్యాణ వేదిక దగ్గర ఏర్పాటుచేసిన చలువ పందిళ్లు కుప్పకూలాయి. ఆలయానికి ఎదురుగా ఉన్న రేకుల షెడ్ గాలికి ఎగిరిపడి పలువురికి గాయాలయ్యాయి. వర్షంతోపాటు బలమైన గాలుల వీయడంతో అక్కడ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు, టెంట్లు చెల్లాచెదురయ్యాయి. 

అకాల వర్షం కారణంగా కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన ముగ్గురు భక్తులు మృత్యువాత పడ్డారు. భారీ వ‌ర్షంతో ఒంటిమిట్టలో విద్యుత్ స‌ర‌ఫ‌రా కూడా నిలిచిపోయింది. ఈదురు గాలుల ధాటికి విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కావడంతో బద్వేలుకు చెందిన చిన్న చెన్నయ్య మరణించాడు. దక్షిణ గోపురం దగ్గర బారికేడ్లు కొయ్యలు పడి వెంకట సుబ్బమ్మ అనే మహిళ మృతిచెందింది. పోరుమామిళ్లకు చెందిన వెంగయ్య తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు.

సీతారాముల కళ్యాణాన్ని కన్నులారా ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన వేలాది భక్తులు వర్షం ధాటికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కల్యాణ వేదిక చుట్టూ వర్షం నీరు చేరడంతో చాలా మంది భక్తులు కల్యాణం చూడకుండానే నిరాశగా వెనుదిరిగారు.

ఈ వేడుకల్లో పాల్గొనేందుకు కడప చేరుకున్న సీఎం చంద్రబాబు భారీ వర్షం కారణంగా ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో గంటసేపు బస చేయాల్సి వచ్చింది. ప్రతికూల వాతావరణంలో ప్రయాణించడం క్షేమం కాదని భద్రతా సిబ్బంది సూచించడంతో ఆయన వర్షం తగ్గేవరకు ఆగి ఆ తర్వాత ఒంటిమిట్టకు వచ్చారు.

Similar News