Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఆన్ ఫైర్... ఏంటి లోకేశ్ ఫ్యూచర్? కూటమిలో కసరత్తుల పర్వం!
AP Political Scenario: టీడీపీ జమానాలో సీఎం చంద్రబాబునాయుడిదే హవా. ఆయన నల్లి అటే నల్లి..బల్లి అంటే బల్లి.. ఏకచ్ఛత్రాధిపత్యమే తప్ప సమాంతర వ్యవస్థలకూ, బహుళ నాయకత్వాలకు తావు లేదు. కానీ ఇప్పుడలా కాదు.
AP Political Scenario: డిప్యూటీ సీఎం అనేది హోదా మాత్రమే. ఆ పదవికేమీ ప్రత్యేక అధికారాలు ఉండవు. అందరి మంత్రుల్లాగే డిప్యూటీ సీఎం కూడా ఒక మంత్రి. మహా అయితే ప్రభుత్వ కార్యక్రమాల్లో, సీఎం పాల్గొనే అధికారిక కార్యక్రమాల్లో వేదికపై ఆసీనులవ్వటానికి ఉపయోగపడే ఒక హోదా. అది కూడా సీఎం అభిమతానికి అనుకూలంగా అధికారులు ఏర్పాట్లు చేస్తుంటారు. అందువల్లనే డిప్యూటీ సీఎంను ఆరో వేలుతో పోలుస్తూ ఉంటారు. ఆరో వేలు అంటే ఉన్నా లేకపోయినా ఒకటేనన్న మాట.
అయితే, ఇది పాత కథ. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఏపీలో ట్రెండింగ్ పాలిటిక్స్ కు సెంటర్ పాయింట్ అయ్యారు. డిప్యూటీ సీఎం అంటే కేవలం హోదా కాదు, పవర్ కూడా అని పవన్ కల్యాణ్ నిరూపిస్తున్నారు.
సీజ్ ది షిప్ అని ఆయన అంటే కాకినాడ పోర్టులో షిప్పు నిలిచిపోయింది. క్షమాపణలు చెప్పాల్సిందే అంటే టీటీడీ చైర్మన్ సహా పాలకమండలి శ్రీవారి భక్తులకు బేషరుతుగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఏంటి ఈయన, ఏంటిదంతా... నాన్సెన్స్ అంటూ అంతర్గతంగా అసహనంతో ఊగిపోతున్న నాయకులు కూటమిలో రోజురోజుకు ఎక్కువవుతున్నారు.
నిజమే.. పవన్ కల్యాణ్ ఇప్పుడు కూటమి సర్కారులో పిడుగులా మారారు. ఆ పిడుగు మబ్బుల మాటున ఎంత కాలం మౌనంగా ఉంటుందో, ఎప్పుడు ప్రకంపనలు రేపుతుందో కూటమి పెద్దలకు అర్ధం కావటం లేదు. ‘‘శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయ్.. బయటకెళితే జనం తిడుతున్నారు, నేనే హోం మంత్రిగా ఉంటేనా?’’ అంటూ హెచ్చరించి ఎక్కువ కాలం కాలేదు.
ఇపుడు తిరుపతి దుర్ఘటనలో చనిపోయిన భక్తుల కుటుంబాలకు బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున తానే క్షమాపణలు చెప్పి చర్చనీయాంశంగా మారారు. నేను క్షమాపణలు చెప్పగా లేనిది మీరెందుకు క్షమాపణలు చెప్పరంటూ టీడీడీ చైర్మన్ నూ, ఈవోను, ఇతర అధికారులను ప్రశ్నించి సంచనలం సృష్టించారు. అంతే కాదు, ఎవరో ఏదో అన్నారని క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదన్న టీటీడీ చైర్మన్... ఆ తరువాత అనివార్యంగా పాలకమండలి తరపున క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇదంతా పవన్ ఎఫెక్ట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
వైకుంఠ ఏకాదళి పర్వదినాన ఉత్తర ద్వారంలో శ్రీవారిని దర్శనం చేసుకోవటం కోసం క్యూలైన్లలో టికెట్ల కోసం నిలబడి తొక్కిసలాటకు గురై ఆరుగురు భక్తులు ప్రాణాలు వదిలారు. పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఇది చీకటి రోజు..ఇలాంటి దుర్ఘటనలు గతంలో ఎన్నడూ కనివినీ ఎరుగని భక్తులు ఆరుగురు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోవటంతో హతాశులయ్యారు. ఇది పూర్తిగా టీడీడీ పాలక మండలితో పాటు టిటిడి అధికారులు, పోలీసు అధికారుల వైఫల్యమేనని స్పష్టంగా వెల్లడవుతోంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయాన అధికారుల తప్పులను ఎత్తి చూపుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మొత్తంగా ప్రభుత్వ వైఫల్యమేనంటూ వైసీపీ రంగంలోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాయపడ్డ వారిని ఆసుపత్రిలో పరామర్శించారు. అన్నటికి మించి టీటీడీ చైర్మన్ కూ, ఈవోకు మధ్య సమన్వయ లోపం, ఇగో సమస్యలు తలెత్తటం, చంద్రబాబు సమక్షంలోనే పరస్పరం గొడవకు దిగటం ప్రభుత్వ ప్రతిష్టను మరింత దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు బేషరతు క్షమాపణ చెప్పటం ద్వారా వేదనాభరితమైన ఒక గంభీర వాతావరణాన్ని చల్లబర్చటానికి ప్రయత్నించారు. పనిలో పనిగా పాలకమండలిని కూడా క్షమాపణలు చెప్పాలని కోరారు.
అయితే, టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు మాత్రం ‘‘క్షమాపణలు చెబితే పోయినవాళ్లు వస్తారా.. ఎవరో ఏదో అంటే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు’’ అనడం మరో వివాదానికి దారితీసింది. ఈ విషయంలో కూడా కూటమి పెద్దలు కల్పించుకుని పరిస్థితి చేయి దాటిపోతుందనీ, క్షమాపణలు చెప్పమంటూ బి.ఆర్ నాయుడుపై ఒత్తిడి తీసుకొచ్చారనీ, ఆ తరువాతనే ఆయనొక మెట్టుదిగి క్షమాపణలు చెప్పారని కూడా పొలిటికల్ సర్కిల్ టాక్. టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు క్షమాపణ చెప్పకపోతే పవన్ కళ్యాణ్ ఏం చేసుండేవారు, ఆయన వైఖరి ఎలా ఉండేదన్న విషయమై కూడా కూటమి పార్టీలో చర్చ నడుస్తోంది.
ఏకచత్రాధిపత్యానికి బ్రేక్...
టీడీపీ జమానాలో సీఎం చంద్రబాబునాయుడిదే హవా. ఆయన నల్లి అటే నల్లి..బల్లి అంటే బల్లి.. ఏకచ్ఛత్రాధిపత్యమే తప్ప సమాంతర వ్యవస్థలకూ, బహుళ నాయకత్వాలకు తావు లేదు. కానీ, కూటమి సర్కారులో మాత్రం సీన్ పూర్తిగా మారిపోయింది. భవిష్యత్ లో పరిస్థితీ చేయి దాటిపోతుందేమోనని కొందరు కూటమి నాయకుల్లో దిగులు కూడా పుడుతోంది. రాష్ట్రంలో ఏదైనా బ్రేకింగ్ న్యూస్ వస్తే, దాని పర్యవసానాలకూ, పరిమాణాలకు కేవలం చంద్రబాబుకు సమాధానం చెబితే సరిపోదు. పవన్ కళ్యాణ్ కు కూడా సమాధానం చెప్సాల్సి ఉంటుంది. చంద్రబాబు ఆదేశాలను మాత్రమే కాదు, పవన్ ఆదేశాలను కూడా శిరసావహించాల్సి ఉంటుందని అర్ధమవుతోంది. తిరుపతి సంఘటన దానికి మహా ఉదాహరణ.
జగన్ సర్కారును దించటంలో పవన్ కీలకపాత్ర పోషించారని భావించే రాష్ట్రంలో, ఒక ప్రధాన మీడియా యాజమని, టిడిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు ఆయన అభీష్టానికి అనుగుణంగా భక్తులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఈ విషయంలో తెరవెనుక పెద్ద హడ్రామానే చోటుచేసుకున్నట్టు కూటమి నేతలు చర్చించుకుంటున్నారు. ఇది ఇష్యూ అయ్యేలా ఉంది. అవతల ఉన్నది పవన్ కల్యాణ్.. ఇగోలకు పోతే తేడాలొస్తాయని నచ్చచెప్పటంతో బి.ఆర్ నాయుడు బెట్టు వదిలి, మెట్టు దిగి క్షమాపణలు చెప్పినట్టు కూటమి నాయకులు టాక్. ఆ తరువాత చనిపోయిన భక్తుల కుటుంబాలకు టీటీడీ ప్రకటించిన ఎక్స్ గ్రేషియా అందచేసే కార్యక్రమంలోనూ బి.ఆర్ నాయుడు పాల్గొనలేదు. టిటిడి ఎక్స్ గ్రేషియా హోం మంత్రి అనిత, మరికొందరు నేతల ద్వారా భక్తుల కుటుంబాలకు అందించారు.
తిరుపతి ఘటనకు సంబంధించి సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా భక్తులను పరామర్శించి, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి, కొందరిపై సస్పెన్షన్ వేటు వేసి, మరికొందరిని బదిలీ చేసి, ఎక్స్ గ్రేషియా ప్రకటించి, ఆ తరువాత మీడియా సమావేశం పెట్టి అన్ని విషయాలు వివరించాక... మళ్ళీ పవన్ రంగంలోకి దిగి క్షమాపణలు చెప్పాలంటూ హుకుంలు జారీ చేయడం ఏమిటని కూటమి పెద్దలు ఆగ్రహం వ్యక్తి చేసినట్లు తెలుస్తోంది.
ఏంటీ పవన్ వ్యవహార శైలి? ఎక్కడో ఒక చోట చెక్ పెట్టకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని కొందరు నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. ముందు ముందు రాష్ట్రంలో ఇంకా అనేక విషయాలపై పవన్ ప్రత్యక్షంగా కలుగచేసుకునే లోపే.. ఆయనను సైలెంట్ చేయడానికి అవసరమైన వ్యూహం పన్నాలని కొందరు బలంగా చెబుతున్నారు.
జగన్ పై పొగడ్తలా.. కూటమిలో చర్చ
కర్నూలులోని గ్రీన్ కో ప్రాజెక్ట్ కు పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించటంపై కూడా కూటమి పెద్దలు లోలోపల ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఈనెల 11న పవన్ కళ్యాన్ కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లారు. జగన్ హయాంలో నిర్మించిన గ్రీన్ కో ప్రాజెక్టులో అటవీ, పర్యావరణ ఉల్లంఘనలు ఉన్నాయని చంద్రబాబుతో సహా పవన్ కూడా గతంలో తీవ్రంగా విమర్శించారు. ఇపుడు కూడా ప్రత్యక్షంగా ప్రాజెక్టును చూసి జగన్ పై పవన్ విరుచుకుపడతాడని భావించిన కూటమి నాయకులు ఖంగుతినేలా పవన్ ప్రవర్తించటంతో అందరూ నోరెళ్ల బెట్టాల్సి వచ్చింది.
గ్రీన్ కో ప్రాజెక్టును అద్భుతంగా నిర్మించారనీ, ప్రపంచంలో ఇలాంటి ప్రాజెక్టే లేదని జగన్ పేరును ప్రస్తావించకపోయినా ఆకాశానికి ఎత్తేశారు. పనిలో పనిగా జగన్ మీడియా పవన్ వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలుచుకుంది. సొంత మీడియాతో పాటు పార్టీ సోషల్ మీడియాలో ఒక రోజంతా పవన్ పొగడ్తల వార్తలే వచ్చాయి. దీనిపై కూటమి పెద్దలు పవన్ వైఖరిపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఇంతకీ పవన్ ఇలా ఎందుకు చేస్తున్నాడని కూడా కూటమిలో అంతర్గతంగా చర్చలు మొదలయ్యాయి. ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖపట్టణంలో పర్యటించినప్పుడు మంత్రి లోకేష్ కు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. వేదికపై పవన్ తో పాటు లోకేష్ కు కూడా చోటు కల్పించారు. ప్రోటోకాల్ ప్రకారం చూసినా లోకేష్ ను కావాలనే ప్రాధాన్యం ఇచ్చినట్లు కూటమిలో చర్చ కొనసాగుతుంది.
పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా ఉంది. లోకేష్ మంత్రి మాత్రమే. మంత్రులెవరికీ స్థానం కల్పించకుండా ప్రధానమంత్రి పాల్గొన్న వేదికపై పవన్ తో పాటు సమానంగా లోకేష్ కు ఇంపార్టెన్స్ ఇవ్వడంపై జనసేన నాయకులు చర్చించుకుంటున్నారు. దీనిపై పవన్ ఏమనుకుంటున్నారు, చంద్రబాబు మనసులో ఏముంది, రాష్ట్ర రాజకీయాల్లో రేపు రాబోయే పరిణామాలేంటనే అంశాలు ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయంగా మారాయి.
లోకేశ్‌కు డిప్యూటీ సిఎం ఇస్తారా?
మోదీ విశాఖ పర్యటనలో లోకేశ్‌కు ఇచ్చిన ప్రాధాన్యం చూసిన తరువాత వచ్చే మంత్రివర్గ విస్తరణలో ఆయనను డిప్యూటీ సీఎం చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. లోకేశ్‌కు కీలకమైన అధికారిక హోదా ఇచ్చి, వచ్చే నాలుగున్నరేళ్ళలో ఆయన నాయకత్వాన్ని పటిష్ట పరచాలని, ఆ తరువాత సీఎం చేయాలని టీడీపీ నాయకత్వం భావిస్తోందని కొందరు చెబుతున్నారు. అందుకు రోడ్ మ్యాప్ రెడీ అయిందని కూడా అంటున్నారు.
అయితే, ఈ విషయంలో పవన్ అనే హర్డిల్‌ను ఎలా దాటాలనే విషయంపై కూడా మంత్రాంగం మొదలైందని అంటున్నారు. మరోవైపు, టీడీపీ అనుకూల మీడియా పవన్ వ్యతిరేక స్వరాన్ని వినిపించడం ప్రారంభించింది. సోషల్ మీడియాలో కూడా లోకేశ్ అనుకూల ప్రచారం మొదలైంది. ఈ పరిణామాలను తమ పార్టీ కూడా గమనిస్తోందని జనసేన నేతలు చెబుతున్నారు. లోకేశ్ విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటే, ఎలా స్పందించాలనే చర్చ కూడా ఆ పార్టీలో మొదలైంది. మొత్తానికి, ఏపీ అధికార కూటమిలో ట్విస్టుల పర్వం మొదలైనట్లే కనిపిస్తోంది.