తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసుల్లో మెజార్టీ కేసులన్నీ ఎత్తివేసినట్టు చెప్పారు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి. పెండింగ్‌లో ఉన్న కొన్ని కేసులు కూడా త్వరలోనే ఎత్తివేస్తామని స్పష్టం చేశారు. కేబినెట్ నిర్ణయం మేరకు ఇప్పటిదాకా 1138 జీవోలు జారీ చేసి వేలాది మందికి ఉపశమనం కలిగించినట్టు ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆందోళనకారులపై ప్రభుత్వం పెట్టిన కేసులపై హోంమంత్రి నాయిని నరసింహారెడ్డితోపాటు మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి సెక్రటేరియట్లో చర్చలు జరిపారు. రైల్వేశాఖకు సంబంధించిన కేసుల్లో పలువురు రాష్ట్ర మంత్రులతోపాటు కొందరు నాయకులు కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, ఇవి కేంద్రం పరిధిలో ఉన్నందున వాటిని వేరుగా పరిష్కరించాలని మంత్రులు పేర్కొన్నారు. 19 కేసులు ఎత్తివేసేందుకు ప్రభుత్వంలో వివిధ దశల్లో ఫైళ్లు ఉన్నాయని, టీఆర్‌ఎస్ పార్టీకి ఉద్యమ కేసుల సమాచారం అందించడానికి [email protected] లేదా వాట్సాప్ ద్వారా 8143726666కు పంపవచ్చని సూచించారు. దీంతోపాటు హోంశాఖకు నేరుగా తమ వివరాలు అందజేయవచ్చని మంత్రులు తెలిపారు.
ప్రస్తుతం తక్కువ కేసులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, రాష్ట్రం ఏర్పడ్డాక ఇచ్చిన మార్గదర్శాలకు అనుకూలంగా ఉన్న అన్ని కేసులను మాఫీ చేశామని డీజీపీ మంత్రులతో చెప్పారు. అయితే, టెక్నికల్ కారణాల వల్ల, సమాచార లోపం వల్ల కొన్ని మిగిలి ఉంటే వాటిని కూడా రెండువారాల్లోగా ఎత్తేయాలని మంత్రులు డీజీపీకి సూచించారు. అయితే, ఈ ప్రక్రియపై ఓ సీనియర్ అధికారి పర్యవేక్షణలో సాధ్యమైనంత త్వరలో అన్ని కేసులు మాఫీ చేస్తామని చెప్పారు డీజీపీ.