ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతుంది. హస్తినలో నిన్నమొన్నటి వరకు ప్రత్యేకహోదా దిశగా మారిన పోరాటం..ఇప్పుడు స్వలాభం కోసం ఎవరి పోరాటం వారు చేస్తున్నారు. వైసీపీ ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంది. జనసేన - లెఫ్ట్ పార్టీలు రాష్ట్రంలో పర్యటనలు చేపట్టేందుకు కార్యచరణను ప్రకటించాయి. దీంతో అన్నీ పార్టీల నాయకులు ప్రత్యేకహోదా కోసం ఒకే తాటిపై కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు.
అధికార పార్టీకూడ తన రాజకీయ ఎత్తుగడలు వేసేందుకు సిద్ధమవుతుంది. చంద్రబాబు నేతృత్వంలో జరిగిన టీడీపీ వ్యూహ కమిటీ భేటీలో వైసీపీ - జనసేన, బీజేపీలను టార్గెట్ చేస్తూ గ్రామగ్రామానా ప్రత్యేకహోదాకోసం ఫైట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం పై కేంద్రంపై అనుసరిస్తున్న తీరును వీడియోలు తీసి..ఆ వీడియోల్ని గ్రామాల్లో ప్రసారం చేయాలని చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం.
అంతేకాదు 30న తిరుపతిలో జరిగే బహిరంగ సభలో పలు సంఘాలతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ భేటీలో గ్రామస్థాయిలో జేఏసీ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఈ కమిటీ రూపకల్పనపై కసరత్తు జరుగుతుండగా... ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు అవసరమైన కార్యాచరణను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు, యువతకు నిరుద్యోగ భృతి, ఈ నెల 11న జ్యోతీరావు ఫూలే, 14న అంబేడ్కర్ జయంతి వేడుకలు, 20న దళిత తేజం కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు.
వీటితో పాటు మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎంపీలు బస్సు యాత్ర చేపడతారని చంద్రబాబు చెప్పారు.