టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌ను టార్గెట్ చేసిన బాబూ రాజేంద్రప్రసాద్ మన హీరోలకు పోరాడే చేవ చచ్చిందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై అన్ని వర్గాలు పోరాడుతుంటే ఒక్క సినీ పరిశ్రమ మాత్రం మౌనంగా ఉండటంపై భగ్గుమన్నారు. ఆందోళనలు, ఉద్యమాల్లో ఎందుకు పాల్గొనడటం లేదని రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు.
జల్లికట్టును నిషేధిస్తే తమిళ ఇండస్ట్రీ మొత్తం కదిలొచ్చి ఉద్యమించిందని కానీ టాలీవుడ్ హీరోలకు హీరోయిన్ల అందాలను వర్ణించడం తప్పా హక్కుల కోసం పోరాటం చేయరా అంటూ మండిపడ్డారు. అవార్డులు రాకపోతే రచ్చరచ్చ చేసే హీరోలు ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బానిస బతుకులు ఇంకెన్నాళ్లన్న టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ ఇకనైనా ఆంధ్రుల హక్కుల కోసం నడుంబిగించాలన్నారు. లేకపోతే తెలుగు సినీ పరిశ్రమను బహిష్కరిస్తామని రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అన్యాయం చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదంటూ టాలీవుడ్ పెద్దలను టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. అసలు టాలీవుడ్‌కి ఏమైందని అడిగారు? పోరాడే చేవ చచ్చిపోయిందా? అని నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్, కవిత సహా తెలంగాణ ప్రజాప్రతినిధులంతా ఏపీ పోరాటానికి మద్దతు పలుకుతుంటే అక్కడే ఉంటున్న టాలీవుడ్ పెద్దల్లో ఒక్కరూ మాట్లాడటకపోవడం శోచనీయమన్నారు. తమిళ నటీనటులను చూసైనా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఇకనైనా ఉద్యమించకపోతే ఐదు కోట్ల ఆంధ్రులు సినీ పరిశ్రమను వెలివేస్తారని రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు.