పవన్‌కు చింతమనేని సవాల్...నేను వ్యక్తిగత విమర్శలు చేస్తే.. మూడు రోజులు అన్నం తినలేవు
జనసేనాని పవన్ తనపై చేస్తున్న ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. రాజ్యాంగేతర శక్తిగా మారారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదేపదే చేస్తున్న ఆరోపణలపై చింతమనేని కౌంటర్ ఇచ్చారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ స్థాయిని దిగజార్చుకుని తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి చూసిన తర్వాత పవన్ మాట్లాడాలని అన్నారు. తనపై 37 కేసులున్నాయని పవన్ తప్పుడు ఆరోపణలు చేశారని.. వాస్తవంగా తనపై ఉన్నవి 3కేసులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. పవన్‌కల్యాణ్ వ్యక్తిగత విషయాల గురించి తాను మాట్లాడితే ఆయన మూడు రోజులు భోజనం చేయరని అన్నారు. ఓ పార్టీకి అధినేతగా ఉన్న పవన్ ఇష్టం వచ్చినట్లు ఆధారాలు లేకుండా మాట్లాడితే ప్రజల్లో చులకన అవుతారని చింతమనేని అన్నారు. తాను రాజ్యాంగశక్తినని పవన్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. పవన్ తాను కొనుగోలు చేసిన ఛానల్ ద్వారా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.