ఏపీ ప్రజలకు అన్యాయం జరుగుతుందనీ, కేంద్రం పట్టించుకునే పరిస్థితి కూడా లేకపోవడం ఎంతో బాధ కలిగించిందన్నారు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. బడ్జెట్ కేటాయింపులు, విభజన హామీల అమలుపై ఏపీలో జరుగుతున్న బంద్‌లో గుండు కొట్టించుకొని నిరసన తెలిపారు బోడె ప్రసాద్. ఉయ్యూరులో చేపట్టిన నిరసన ప్రదర్శనలో భాగంగా గుండు కొట్టించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని నాలుగు రోజులుగా తెదేపా ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు కేంద్రానికి తాకాలన్న ఉద్దేశంతోనే నిరసన చేపట్టినట్లు తెలిపారు.