ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి వర్గంలో జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోవర్టులున్నారా? అమరావతిలో విస్తృతంగా జరిగే చర్చల్లో ఇది ప్రధానమైనదిగా చెప్పొచ్చు. స్వయానా కొందరుమంత్రులు, మరికొందరు ఎంఎల్ఏలు పవన్ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. వారి వైఖరిపై ముఖ్య మంత్రి చంద్రబాబు పూర్తి అసంతృప్తితో ఉన్నారట.
మైత్రి రాజకీయాలు చంద్రబాబు నాయుడుగారికి అవసరం. రాజకీయంగా ఆయన స్వంతంగా సాధించిన రాజకీయ విజయాలు దాదాపు శూన్యం. ఆయన నలభైయ్యేళ్ళ సుధీర్ఘ రాజకీయ జీవితంలో. ఆయన ప్రతి మైత్రి ముగిసేది శత్రుత్వం తోనే. అలాగే నేడు పవన్ కళ్యాణ్ తో మైత్రి అలాగే ముగిసింది. ఎందుకంటే, తన ఆధ్వర్యంలో ఏర్పాటు అయి నిర్వహించిన రెండు అఖిలపక్ష సమావేశాలకు కూడా జనసేన తరపున కనీసం ప్రతినిధులు కుడా హాజరవ్వని పరిస్థితులు. తన దగ్గర ఉన్న పవన్ కోవర్టులు కూడా జనసేన ప్రతినిధులను రప్పించ లేకపోయాయని చంద్రబాబు వాపోతున్నారట. ఈ విషయమై తమ సామాజిక వర్గానికి చెందిన పలువురు మంత్రులు, ఐఏఎస్ అధికారుల వద్ద కూడా చంద్రబాబు తన మనోవేదనను వెలిబుచ్చారట.
తమ మంత్రుల్లో కొందరు అనుక్షణం పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూ ఉంటారని, అలాంటి మంత్రులు ఎంఎల్ఏలు టచ్ లోనే ఉంటూ ఉన్నా కూడా మన అవసరాలకు మాత్రం ఆయన్ని రప్పించలేక పోతున్నారంటూ మండిపడ్డారట చంద్రబాబు. ఆమధ్య జనసేన ఆవిర్భావ బహిరంగ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తనతో టిడిపికి చెందిన 40 మంది ఎంఎల్ఏలు ఎల్లప్పుడూ టచ్ లో ఉంటున్నట్లు చెప్పిన విషయం మనం ఇక్కడ గుర్తుచేసుకోవాలి.
ఏపి ప్రభుత్వంలో తెలుగుదేశం ఆద్వర్యంలో జరుగుతున్న భారీ అవినీతి గురించి ప్రత్యేకించి లోకేష్ అవినీతి కథాకమామిష్ కి సంబంధించి సమాచారం తనకు వారే ఇచ్చి నట్లు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన తెలుగుదేశం అధినేత అంతరంగంలో పెద్ద అలజడినే అంతకుమించి దుమారాన్నే రేపింది. బహుశా ఆ విషయాన్నే చంద్రబాబు నాయుడు మనసులో ఉంచుకుని మంత్రుల్లో కొందరు పవన్ తో టచ్ లో ఉన్నట్లు చెపుతున్నట్లు భావిస్తున్నారు.
శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి కూడా ఒక్క ప్రతిపక్షం కూడా హాజరుకాకపోవటం చంద్రబాబుకు పెద్ద షాకే. ఇప్పుడు చంద్రబాబును ఇక అపర చాణక్యుడు అనలేము. ఆయన అన్నట్లు ఆయన జీవితం మాత్రమే తెరిచిన పుస్తకం కాదు - నేడు ఆయన అంతరంగం, మస్తిష్కం కూడా తెరిచిన పుస్తకమే. రాజకీయంగా రాష్ట్రంలో తెలుగుదేశం అంటరాని పార్టీ, ఏకాకిగా మిగిలిపోయింది. ఎవరూ నమ్మని పరిస్థితులకు కారణం ఆ పార్టీలోని సామాజిక వర్గ దురభిమానం మాత్రమే మొదటిదైతే, రెండవది చంద్రబాబు కుటుంబస్వార్ధం, మూడవది ఒక సామాజిక వర్గ పార్టీగా కుంచించుకుపోతున్న పార్టీ స్వార్ధం, నాలుగవది అధికారుల్లో పెరిగిపోతున్న అవినీతి బందుప్రీతి. ఐదవది అమరావతి మాది కాదు అనే ఇతర ప్రాంతాల వారి అంతరంగాల్లో ఇంతింతై వటుడింతై పెరిగిపోతున్న అభిభావన.