స్టీల్ ప్లాంట్ కోసం ఆందోళనలు ఉదృతం చేయండి

Update: 2018-06-26 12:14 GMT

కడప ఉక్కు ఉద్యమంలో బీటెక్ రవి, సీఎం రమేష్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా..బీజేపీ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన ఆయన...బీజేపీ, వైసీపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అవినీతి పరులను కట్టడి చేయలేని స్థితిలో బీజేపీ ఉందని చెప్పారు.  

సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో కడప స్టీల్ ప్లాంట్, సీఎం రమేష్ దీక్ష, బైక్ ర్యాలీలు, తాజా రాజకీయ పరిణామాలపై నేతలు చర్చించారు.  ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. బీజేపీ, వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీకి అద్దె మైకులా మారారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 

కడప స్టీల్ ప్లాంట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సైకిల్ ర్యాలీలు, ధర్నాలు చేపట్టాలన్నారు. ప్రజల్లో అవగాహనను పెంచి చైతన్యపరచాలని సూచించారు. అంగన్‌వాడీలు, హోంగార్డులు, వీఆర్‌ఏల జీతాలు పెంచామని, ఆశా వర్కర్ల జీతాల పెంపుపై రేపోమాపో నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. 62వేలమందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామని చెప్పారు.

ఇక కడప ఉక్కు దీక్షకు సొంత రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. సీఎం రమేష్‌కు డీఎంకే ఎంపీ కనిమొళి సంఘీభావం తెలిపారు. ఏపీ హక్కుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కేంద్రం మాట మీద నిలబడి ఉంటే ఈపాటికి విభజన చట్టంలో హామీలన్నీ నెరవేరేవని చెప్పారు. బీజేపీకి హిందుత్వం తప్ప దేశ క్షేమం పట్టదని కనిమొళి ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు ఆదేశంతో కడప ఉక్కు దీక్షకు మద్దతుగా ఆ పార్టీ శ్రేణులు  రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమయ్యారు. దీంతో ఏపీలో రేపటి నుంచి సమరం జరగబోతోంది. 

Similar News