నా టార్గెట్ సీఎం సీటే.. కష్టకాలంలో కొత్త దారి వెతుక్కోవడం నాకేం కొత్త కాదు. నాకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. నన్ను నమ్మితే సొమ్మునైతా.. నమ్మకపోతే మన్నునైతా.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిస్తే వెంటనే రాజీనామా చేస్తా. నాకు వయసుంది. ఓపికుంది. ఇవి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి మాటలు. రేవంత్ రెడ్డి తన సన్నిహితుల దగ్గర సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తనపై జరుగుతున్న కుట్రపై ఆయన ఆగ్రహంతో వ్యక్తం చేసినట్టు తెలిసింది. తనకు సంక్షోభాలేం కొత్త కాదని.. వాటి నుంచే తాను ఎదిగానని చెప్పినట్టు తెలుస్తోంది. టీడీపీ కష్టకాలంలోనే అక్కడ చేరానని గుర్తు చేసినట్టు సమాచారం.
తాను కాంగ్రెస్ పార్టీలో చేరినపుడు వర్కింగ్ ప్రెసిడెంట్‌తో పాటు మరో పదవి ఇస్తామని.. ఇంకా చాలా హామీలిచ్చారని.. వాటి అమలుకు కోరినట్లు సమాచారం. తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి సరిపెడదామంటే వెంటనే రాజీనామా చేస్తానని స్పష్టం చేసినట్టు తెలిసింది. పార్టీ నన్ను నమ్మితే సొమ్మునైతా లేకుటే మన్నునైతా అనే మాట సన్నిహితుల దగ్గర పదేపదే అన్నట్టు తెలిసింది. తన లక్ష్యం సీఎం పదవేనని... ఇప్పుడు కాకున్నా.. కొన్నేళ్ల తర్వాతైనా తాను సీఎం అవుతానని అన్నారు. నాకు వయస్సు ఉంది. ఓపిక ఉంది. నా టార్గెట్ అయిన సీఎం పదవి కోసం ఎన్ని రోజులైనా వేచి చూస్తా తప్ప మంత్రి పదవి తీసుకోనని చెప్పినట్టు తెలుస్తోంది.
రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని రేవంత్ అభిప్రాయపడినట్టు తెలిసింది. ఓటుకు నోటు కేసు విషయం రాహుల్ గాంధీకి ముందుగానే చెప్పానని మిత్రులతో అన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపైనా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడికి సలహాలిచ్చేవారు సరిగ్గా లేరని సన్నిహితులతో అన్నట్టు తెలుస్తోంది. తన పని తీరు తెలిసినా తనను తగిన విధంగా వాడుకోవడం లేదన అసహనం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
కేసీఆర్ కు ఎదురు నిలబడే శక్తి తనకే ఉందంటున్న రేవంత్ రెడ్డి... వైఎస్ లాంటి నేతలు ఎంత ప్రలోభ పెట్టినా తాను లొంగలేదని అన్నారు. చంద్రబాబు వద్ద తాను చెప్పిందే వేదంగా నడిచిందని రేవంత్ గుర్తు చేసుకున్నారు. బీజేపీలోకి రమ్మని అమిత్ షా ఎన్నో ఆఫర్స్ ఇచ్చినా.. కేసీఆర్‌పై పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీనే సరైన వేదికని భావించి వచ్చినట్టు సన్నిహితులతో చెప్పుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రేవంత్ చెప్పినా.. అవి పీసీసీ చీఫ్‌తో ఆయనకు పొసగడం లేదని చెప్పకనే చెప్పారు. ఇక ఈ వివాదం ఏ దుమారానికి దారి తీస్తుందో చూడాలి.