భారత ప్రధాన ఎన్నికల అధికారిగా సునీల్ అరోరా పదవీ బాధ్యతలు చేపట్టారు. మొన్నటివరకు పని చేసిన ఓపి రావత్ పదవీ కాలం ముగియడంతో సునీల్ అరోరా ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. 1980- ఐఎఎస్ బ్యాచ్ రాజస్థాన్ కేడర్‌కు చెందిన సునీల్ ప్రభుత్వంలో వివిధ కీలక పదవుల్లో పని చేశారు. సమాచార, ప్రసార నైపుణ్య అభివృద్ధి మంత్రిత్వ శాఖలో కార్యదర్శి స్థాయి పదవిలో ఆయన పనిచేశారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగానూ, ఐదేళ్ల పాటు ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో మేనేజింగ్ డైరెక్టర్‌గానూ సేవలందించారు. వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికలను సునీల్ అరోరా నేతృత్వంలోనే ఎన్నికల సంఘం నిర్వహించనుంది. జమ్ముకాశ్మీర్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, హర్యానా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.