పేరుకేమో వానాకాలం. వాతావరణం మాత్రం ఎండాకాలం. ఇదీ.. తెలుగు రాష్ట్రాల్లో కొన్నాళ్లుగా.. నెలకొన్న వింత వాతావరణం. రుతుపవనాలొచ్చినా.. ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. వర్షాలు పడతాయనుకుంటే.. అందుకు బదులుగా ఎండలు మండిపోతున్నాయి. జూన్‌లో సీన్ మారిపోతుందనుకుంటే.. మేలో ఉన్న సిచ్యువేషనే.. కంటిన్యూ అవుతోంది. జూన్ మూడో వారం వచ్చినా.. ఎండలు ఏమాత్రం తగ్గడం లేదు.
రుతుపవనాలొచ్చాయి.. వర్షాలు పడతాయి.. వెదర్ కాస్త కూల్ అవుతుందనుకుంటే.. అస్సలు ఆ సీనే లేదు. ఎండల ఎఫెక్ట్‌తో.. ఏపీలోని స్కూళ్లకు ప్రభుత్వం 3 రోజుల పాటు సెలవులను పొడిగించిందంటేనే.. ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణంలో ఎలా ఉందో అర్థమవుతోంది. ఇప్పటికీ.. విజయవాడ, నెల్లూరు, ఒంగోలుతో పాటు తెలంగాణలోని ఖమ్మంలో ఎండాకాలాన్ని తలపించేలా.. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్క్ క్రాస్ చేశాయి.
4 నెలలు ఎండాకాలంతో వేగాక.. రుతుపవనాలొచ్చాయని సంబరపడ్డాం. వర్షాలు కురుస్తాయని.. ఆశగా ఎదురుచూశాం. కానీ.. మన ఆశలన్నీ ఇప్పుడు కాస్తున్న ఎండలకు ఆవిరైపోతున్నాయి. ఈసారి ఎండాకాలం పగబట్టి.. ఇంకో నెల ఎక్కువచ్చినట్లుగా ఉంది. వానల సంగతి పక్కనబెడితే.. వాతావరణం చల్లబడితే చాలన్నట్లు తయారైంది ఒక్కొక్కరి పరిస్థితి.
అసలు వానలు దంచుతాయనుకుంటే.. ఎండలెందుకు దంచుతున్నాయి.? ఇదే విషయంపై వాతావరణశాఖ అధికారులను హెచ్ఎంటీవీ ఆరా తీసింది. అరేబియా, బంగాళాఖాతం నుంచి తేమతో కూడిన గాలులు రాకపోవడం వల్లే.. ఉష్ణోగ్రతల్లో మార్పు లేదట. అంతేకాదు.. ఉత్తర భూభాగం నుంచి వేడిగాలులు వీయడం కూడా.. అధిక ఎండలకు కారణమవుతోందట. నైరుతి రుతుపవనాల కదలిక చాలా బలహీనంగా ఉండటం వల్లే.. వర్షాలు కురవడం లేదు. వీటి ఫలితంగా.. ఎండలు ఎండాకాలంలో లాగే ఎక్కువగా కాస్తున్నాయి. రేపటి నుంచి రుతుపవనాల కదలికల్లో.. మార్పులొస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. రేపు సాయంత్రానికి.. కచ్చితంగా వాతావరణంలో మార్పు వస్తుందంటున్నారు.