దేవుడిగా భావించి 26 రోజుల పాటు పూజలందుకున్న పాము మృతి చెందింది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలోని దుర్గాడ గ్రామంలో ఓ పామును.. అక్కడి ప్రజలంతా సుబ్రహ్మణ్యస్వామిగా భావించి.. పూజించారు. అయితే 26 రోజుల తరువాత.. కుబుసం విడిచిన వెంటనే.. పాము కన్నుమూసింది. దీంతో గ్రామస్తులంతా కన్నీరు పెడుతున్నారు.
మరోవైపు పాము మృతికి ఎస్సై శివకృష్ణ కారణమంటూ ఆరోపిస్తున్నారు గ్రామస్థులు. ఉదయం 10 గంటల వరకు దర్శనమిచ్చిన ఆ పాము సుమారు 11 గంటల సమయంలో మృతి చెందింది. ఎస్సై శివకృష్ణ అక్కడి నుంచి వెళ్లిన కొంత సేపట్లో మృతి చెందిందని ఎస్సైతో పాటు వచ్చిన ఒక వ్యక్తి పాము వద్ద ఉన్న రుమాలును వేసి వెళ్లాడని, వస్త్రం వద్దకు చేరిన పాము కొద్దిసేపట్లో మృతి చెందినట్టు గ్రామస్తులు గుర్తించారు. మంత్రసానిని తీసుకువచ్చి వస్త్రంపై మందు వేసి పామును చంపినట్టు గ్రామస్తులు అనుమానించారు. ఇన్నాళ్లూ దేవుడిగా పూజించిన పాము మరణించడంతో.. దేవుడు గ్రామం విడిచి వెళ్లిపోయాడాంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.