పవన్ సరికొత్త రికార్డు సృష్టించారు. తన అభిమానులు, అనుచరులు, అయిన వాళ్లు గర్వించేలా.. కాలర్ ఎగరేసేలా.. మా నాయకుడు అని గర్వంగా చెప్పుకునేలా చేశారు. ఎవరికీ ఇప్పట్లో సాధ్యం కాని.. అనితర సాధ్యమైన ఘనతను తన పేర లిఖించుకున్నారు. తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు.
ఇంతకీ.. ఈ పవన్ ఎవరు? మన జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏనా? కాదు. ఈయన మన పవన్ కల్యాణ్ కాదు. సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్. ఒక రాష్ట్రానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా.. కమ్యూనిస్టు కురువృద్ధుడు జ్యోతిబసు పేరుమీద ఉన్న రికార్డును పవన్ తిరగరాశారు.
సిక్కింకు ముఖ్యమంత్రిగా పవన్ చామ్లింగ్.. నిన్నటితో 23 ఏళ్ల 4 నెలల 17 రోజుల కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అంతకు ముందు.. ఈ రికార్డు జ్యోతిబసు పేరుతో ఉండేది. దీంతో.. పవన్ చామ్లింగ్ పై దేశ రాజకీయ వర్గాలు ఆసక్తిగా చర్చిస్తున్నాయి. చూడటానికి చాలా మెతకగా కనిపించే మనిషే అయినా.. సవాళ్లను అంతే మెతకగా పరిష్కరించే సామర్థ్యం ఆయన సొంతం కావడంతో.. రాజకీయంగా ఉన్నత స్థానానికి చేరారు.
చామ్లింగ్ కుటుంబంపై అవినీతి ఆరోపణలు ఉన్నా కూడా.. పరిపాలనలో మాత్రం అవేవీ ఆయనపై ప్రభావం చూపించలేకపోయాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత పరిశుభ్రమైన పర్యాటక రాష్ట్రంగా సిక్కింను ఆయన అభివృద్ధి చేయడంతో.. ఆ రాష్ట్రాన్ని స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అన్న పేరు కూడా వచ్చింది. ఇలా.. ఆరోపణలతో కంటే పనితీరుతోనే పవన్ చామ్లింగ్ మంచి పేరు తెచ్చుకున్నారు. అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నారు.