భార్య మీద తనకున్న వాత్సల్యాన్ని ఓ పెద్దాయన వినూత్నరీతిలో కనబరిచాడు. భార్య చనిపోయాక ఆమె చివరికోరిక కోసం ఏకంగా 17 లక్షల రూపాయలను విరాళంగా అందజేశాడు. అసలు వివరాల్లోకి వెళితే.. ఈ పెద్దాయన పేరు జేపీ బదౌని(71). ఐఏఎఫ్ సీనియర్ అధికారి, రిటైర్డ్ వింగ్ కమాండర్. ఊరు ఢిల్లీ. అయనకు తన భార్య అంటే చెప్పలేని ప్రేమ. దూరంగా ఉన్నా.. దగ్గరగా ఉన్నా ఆమెను విడిచి ఉండలేడు. అయన భార్య విధు బదౌని కూడా అంతే భర్తను విడిచి క్షణమైనా ఉండలేదు. విధు బదౌని ఎయిర్‌ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇనిస్టిట్యూట్‌లో 1986 నుంచి 21 సంవత్సరాల పాటు టీచర్‌గా సేవలు అందించారు. దురదృష్టవశాత్తు ఆమె ఈ ఏడాది ఫిబ్రవరి 6న గుండెపోటుతో మరణించారు. దాంతో పిల్లలు ఉండి కూడా ఒంటరయ్యారు జేపీ బదౌని. ప్రతిక్షణం ఆమెను తలుచుకుంటూ ప్రతిరోజు ఆమె రాసిన డైరీ చదివేవారు. ఈ క్రమంలో ఆమె రాసిన ఓ వాక్యాన్ని చదివి బాధపడ్డాడు. స్కూల్ టీచర్ గా రిటైర్ అయినతరువాత స్కూల్ లోని పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు, అలాగే పాఠశాల మౌలిక వసతులు అభివృద్ధికి కొంత డబ్బును ఇవ్వాలని ఆమె డైరీలో రాసుకుంది. కానీ మధ్యలోనే ఆమె చనిపోవడంతో ఆమె కోరిక అలాగే మిగిలిపోయింది. దాంతో డైరీ చదివిన భర్త.. తన భార్య కోరిక మేరకు ఆ స్కూల్ కు రూ. 17 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని తన ఆమె కోరిక మేరకు వినియోగించాలని ఆ స్కూల్ ప్రిన్సిపల్ పూనం ఎస్ రాంపాల్ కు సూచించారు. ఈ సందర్బంగా మాట్లాడిన జేపీ బదౌని తన భార్య అంటే తనకు చాలా ఇష్టమని ఆమెకోసం ఏదైనా చేస్తానని అన్నారు. కాగా తన కుటుంబసభ్యులు తాను చేసిన ఈ పనికి మద్దతు తెలిపారన్నారు.