సంక్రాంతి తర్వాత టీడీపీలో చేరుతానని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. నిన్న అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబును బైరెడ్డి కలిశారు. అనంతరం బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీలో చేరిక అంశంపై చర్చ జరగలేదని, కానీ టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని బైరెడ్డి స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ తర్వాత ముహూర్తం చూసుకుని టీడీపీ పార్టీలో చేరతానన్నారు. రాయలసీమ నీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని కోరానని, దీనికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. పదవులు, సీట్ల విషయంపై చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటానని బైరెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ పోటీ చేయాల్సిన చోట చేయకుండా..పోటీ అవసరం లేని చోట జగన్ పోటీ పెడతారని విమర్శించారు.