మొన్న ఉన్నవ్.. నిన్న కథువా.. ఇవాళ దాచేపల్లి.. ఎక్కడైనా.. ఆడపిల్లలపై దాడులే.. చట్టాలెంత కఠినం చేసినా ఈ మానవ మృగాలు ఇంకా చెలరేగుతూనే ఉన్నారు. అమాయక ఆడపిల్లలపై లైంగిక దాడులకు తెగబడుతూనే ఉన్నారు..నెలల చిన్నారుల నుంచి పండు ముసలివాళ్లనూ వదిలిపెట్టడం లేదు.. ఎక్కడుంది లోపం?ఎందుకీశాపం?
మానవత్వం మంటగలిసిపోతోంది. ముక్కు పచ్చలారని చిన్నారులపై మృగాళ్ల పాశవిక దాడికి హద్దు, పద్దు లేకుండా పోతోంది. బరితెగించి మానవ మృగాలకు పసిపిల్లలనీ లేదు.. పండుటాకులనీ లేదు.. ఆడపిల్ల కనిపిస్తే చాలు కామం కట్టలు తెంచుకుంటోంది. వయసు , వావీ వరస అన్నీ వదిలేసి విచక్షణ కోల్పోయిన మృగాల్లా కలబడుతున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో అమయక మైనర్ బాలిక ఇలాగే ఓ కామాంధుడి కాటుకి బలైంది. చాక్లెట్లిస్తానని చెప్పి నమ్మించి వెంట తీసుకెళ్లిన నయవంచకుడు సుబ్బయ్య ఆ పసిదానిపై అత్యాచారం జరిపాడు.. రిక్షా కార్మికుడైన సుబ్బయ్యకు పెళ్లయినా ఈ నేరగాడి అకృత్యాలను భరించ లేక భార్య వదిలేసి వెళ్లిపోయింది. అప్పటినుంచి రిక్షా తొక్కుతూ జీవనం వెళ్లదీస్తున్న ఇతగాడు.. తొమ్మిదేళ్ల మైనర్ బాలికను లొంగదీసుకుని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో చిన్నారి తల్లిదండ్రులకు విషయం చెప్పేసరికే ఈ కామాంధుడు అక్కడనుంచి ఉడాయించాడు.. విషయం ఆనోటా ఆనోట ఊరంతా పాకింది. మైనర్ బాలికపై అదీ ఓ ముస్లిం బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన వైనంపై ఊరంతా రగిలిపోయింది. పట్టరాని ఆగ్రహంతో సుబ్బయ్య ఇంటిని ధ్వంసం చేసింది. ఇది మతవివాదంలా మారడంతో దాచేపల్లిలో144వ సెక్షన్ పెట్టాల్సి వచ్చింది.
వైసిపి అధినేత జగన్ చంద్రబాబు సర్కార్ ను నిందిస్తూ ట్వీట్ చేయడంతో వివాదం రాజకీయ రంగు పులుముకుంది. వైసిపి ఎమ్మెల్యే రోజా పర్యటనతో ఈ వివాదం మరింత హీటెక్కింది. నేరగాడి రాజకీయ నేపధ్యాన్ని ప్రశ్నిస్తూ టిడిపి, వైసిపి నిందారోపణలు చేసుకున్నాయి. అటు కశ్మీర్ లోనూ కొన్ని నెలల క్రితం ఇలాంటి ఘటనే దేశాన్ని కుదిపేసింది. అక్కడా 12 ఏళ్లు నిండని ఓ అమాయక ముస్లిం బాలికే కామాంధుల పైత్యానికి బలైంది. గుర్రాలను మేపేందుకు అడవిలోకి వెళ్లిన ఆసిఫా అనే బాలికని అదే గ్రామానికి చెందిన కొందరు హిందువులు చెరబట్టి కొన్నాళ్ల పాటూ నిరవధిక అత్యాచారానికి పాల్పడ్డారు.. బాలికను ఓ ఆలయంలో బంధించి మరీ నేరగాళ్లు ఈ దారుణానికి పాల్పడినట్లు.. చివరకు ఆమెను దారుణంగా చంపేసి అడవిలో పడేసినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. హిందువుల ఆధిపత్యం గల కథువా ప్రాంతం నుంచి బాకర్వాల్ ముస్లిం సంచారజాతి వారిని తరిమి కొట్టడానికే చిన్నారి ఆసిఫాను కిడ్నాప్ చేసినట్లు నిందితుడు సంజీరామ్ ఒప్పుకున్నాడు. ఈఘటనలో గుడి పూజారితో పాటూ ఘనత వహించిన ఓ పోలీస్ అధికారి కూడా పాల్గొన్నాడు. ఆసిఫాను చంపేసేముందు అత్యంత పాశవింకంగా ఈ అధికారి లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఆసిఫా ఘటనపై దేశం మొత్తం తిరగబడింది. అమాయక చిన్నారికి జరిగిన అన్యాయంపై పార్టీలకతీతంగా అందరూ ఎదురు తిరిగారు. కానీ ఇది సామాన్యమైన ఘటనేనంటూ పిడిపి ప్రభుత్వంలో ఉన్న బిజెపి మంత్రులు కొందరు కొట్టి పారేశారు. పైగా నిస్సిగ్గుగా నిందితులకు మద్దతుగా ర్యాలీలూ నిర్వహించారు. .కథువా ఘటన విచారణపై సుప్రీ కోర్టు స్టే విధించింది. బాధితురాలి తండ్రి కోరిక మేరకు రాష్ట్రం బయటకు కేసును బదిలీ చేయాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఇక ఇలాంటిదే మరో ఘటన. యూపిలో 17 ఏళ్ల యువతిపై ఏకంగా ఓ బిజెపి ఎమ్మెల్యే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఇంటికి పిలిచి అత్యాచారం చేశాడు. ఓ వారం తర్వాత ఎమ్మెల్యే అనుచరులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లి మళ్లీ అత్యాచారం జరిపారు. తప్పించుకున్న బాధితురాలు.. పోలీసులకు కంప్లయింట్ ఇస్తే చర్యలు తీసుకోలేదు. దాంతో సిఎం యోగి ఆదిత్య నాథ్ ను కలిసిన ఆ యువతి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తానన్న సిఎం ఆదుకోలేదు.. కంప్లయింట్ చేసినందుకు బాధితురాలి తండ్రి చావుదెబ్బలు తినాల్సి వచ్చింది..ఆడపిల్లలపై ఆదిమ కాలం తరహా దాడులకు అంతం ఉండదా ? కఠినమైన చట్టాలున్నా.. కామాంధులు బరితెగించిన మృగాల్లా విరుచుకు పడటానికి కారణం వెనక రాజకీయ భరోసా ఉండటమేనా?నేరం , రాజకీయం కలగలిస్తే.. మానవత్వం మంటగలవాల్సిందేనా? అమాయక ఆడపిల్లలు ఇలా బాధితుల్లా మిగలాల్సిందేనా?