కడప జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అనంత కుమార్ హెగ్డేకు ఉక్కు సెగ తగిలింది. కడప అర్అండ్‌బి అతిథి గృహం వద్దకు చేరుకున్న అనంతరం మంత్రి కాన్వాయ్‌ని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఓ మహిళా కార్యకర్త మంత్రి వాహనంపై బూటు విసిరేసింది. కాన్వాయికి అడ్డంగా పడుకుని నిరసన వ్యక్తం చేశారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని, విభజన చట్టంలో ఉన్నా ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో బిజేపి కార్యకర్తలకు, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. టీడీపీకి కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో టీడీపీ ప్రతిపక్షంలోకి రావడంతో ... బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కేంద్రంతో పాటు ఏపీలోనూ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.