ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలను ప్రొత్సహించేందుకు... సర్కార్ కేసీఆర్ కిట్ల పథకాన్ని ప్రవేశపెట్టారు. కేసీఆర్ కిట్ పథకంతో సర్కార్ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య విపరీతంగా పెరిగింది. పథకాన్ని ఆర్బాటంగా ప్రవేశపెట్టిన సర్కార్...సౌకర్యాలను గాలికి వదిలేసింది. గర్బిణీలు ప్రభుత్వాసుపత్రిలో చేరాలని పదే పదే చెబుతున్న ప్రజా ప్రతినిధులు...బాలింతల బాధలను పట్టించుకోడం లేదు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పేదలకు, మహిళలకు ఏకైక దిక్కు హన్మకొండ ప్రసూతి ఆసుపత్రి. అమ్మఒడి, కేసీఆర్ కిట్ల పథకం తర్వాత...సర్కార్ ఆసుపత్రులకు గర్బిణీలు క్యూకడుతున్నారు. అన్ని మండల కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేస్తున్నా...... హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చే గర్భిణుల సంఖ్య మరింత పెరిగింది. ఒకే మంచంపై ఇద్దరు లేదా ముగ్గురు గర్భిణులకు వైద్య చికిత్సలు అందించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రభుత్వాసుపత్రికి బాలింతలు క్యూ కడుతున్నా....అధికారులు మాత్రం ఉన్న మంచాలనే ఇద్దరు లేదా ముగ్గురికి కేటాయిస్తున్నారు. దీంతో మంచం కోసం బాలింతల మధ్య గొడవలు జరుగుతున్నాయ్. బేబీకి పాలు ఇచ్చేటపుడు మాత్రమే బాలింతలు మంచంపైకి ఎక్కుతున్నారు. ఎక్కువ సమయం కిందే పడుకుంటున్నారు.
హన్మకొండ ప్రసూతి ఆస్పత్రిలో ఏప్రిల్ నెలలో 520పైగా ప్రసవాలు జరిగాయ్. గతంలో కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టక ముందు ప్రతి రోజు ఓపీలో 100 నుంచి 150 మందికి వైద్యసేవలు అందేవి. కిట్ ప్రవేశపెట్టిన తర్వాత వీరి సంఖ్య రెట్టింపైంది. గతంలో ఇక్కడ వసతులకు సరిపడ ప్రసవాలు జరిగేవి. ఇప్పుడు పరిమితికి మించి ప్రసవాలు జరుగుతున్నాయ్. గర్బిణీలు పెరుగుతున్న బెడ్లు పెంచకపోవడంపై గర్బిణీలు, వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వంద పడకల కోసం కేటాయించిన వైద్యులే... ఇప్పుడు 200 నుంచి 300 మందికి సేవలందిస్తున్నారు. రోగులకు సరిపడనంత పడకలు లేవు, వైద్యులూ, నర్సులు, సిబ్బంది లేరు. దీంతో గర్భిణులు, బాలింతలు పడరాని పాట్లు పడుతున్నారు. పడకలు సరిపోక వరండాలో ఉండాల్సిన దుస్థితి తలెత్తిందని బాలింతల బంధువులు చెబుతున్నారు.