మనీ మ్యాటరే బెడిసికొట్టిందా...ప్రబోధానంద ఆశ్రమం వ్యవహారం వెనుక ఆసక్తికరమైన విషయాలు

Update: 2018-09-25 10:16 GMT

రాజకీయ రంగు పులుముకున్న ప్రబోధానంద ఆశ్రమం వ్యవహారం వెనుక ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ పూర్తి ఘటన వెనుక డబ్బు వ్యవహారమే కారణమని చెబుతున్నా ఎవరు ఎవరిని డిమాండ్‌ చేశారు..? అసలు అగ్నికి ఆజ్యం పోసిందెవరు..? అన్న దానిపై నివ్వెరపర్చే నిజాలు బయటకొచ్చాయి. 

త్రైత సిద్ధాంతం బోధిస్తున్న ప్రబోధానంద ఆశ్రమ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. మొన్న జేసీ వర్సెస్ పోలీసుగా మారిన వ్యవహారం తర్వాత అసలు రహస్యాలు వెలుగుచూస్తున్నాయి. వినాయక నిమజ్జనం సమయంలో రంగులు పడ్డాయంటూ ఇరు వర్గాల మధ్య గొడవలు జరగడం ఇష్యూలోకి ఎంట్రీ ఇచ్చిన జేసీ దీక్షకు దిగడం తర్వాత ఆశ్రమంలో తనిఖీలు చేపట్టడం వంటి చకచకా జరిగిపోయాయి. అయితే జరిగిన వ్యవహారాలపై జేసీ దివాకర్ రెడ్డి వ్యవహారశైలిని తప్పుపడుతూ పోలీసు అధికారుల సంఘం మాటల తూటాలు పేల్చగా జేసీ డబ్బు డిమాండ్‌ చేశారని స్వామీ ప్రబోధానంద స్పందించారు. అందుకే మాపై కక్ష కట్టారని అన్నారు. 

అయితే స్వామి చేసిన ఆరోపణల్లో నిజమెంత..? నిజంగానే జేసీ సోదరులు స్వామిని డబ్బు డిమాండ్‌ చేశారా..? ఇందులో ఏది నిజం..? దీనిపై కూపీ లాగితే.. హెచ్‌ఎం టీవీకి ఓ కీలక ఆధారం దొరికింది. ప్రబోధానంద శిష్యలుగా చెప్పుకున్న వ్యక్తులే ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి తమ డిమాండ్లు నెరవేర్చాలని మధ్యవర్తిత్వం పంపినట్లు తెలిసింది. ఇందులో ఇద్దరు ఆర్ఎంపీ వైద్యుల మధ్య రాయబారం నడిచినట్లు తేలింది. ప్రబోధానంద శిష్యుడు ఆర్ ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్న మహేష్ అనే వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడుగా పేరున్న మరో ఆర్ఎంపీ వైద్యుడు శ్రీనాథ్ ద్వారా పలు డిమాండ్లను ఓ చీటిలో రాసి పంపారు. దాని ప్రకారం చిన్నపొలిమెడ సర్పంచి రవికి సంబంధించిన రెండెకరాల భూమి, ఏడు సెంట్లు స్థలం తమకు కావాలని వీటితో పాటు 50 లక్షల నగదు ఇవ్వాలని ఓ చీటీలో రాసి పంపినట్లు ఆర్ఎంపీ వైద్యుడు శ్రీనాథ్ హెచ్ ఎంటీవీకి తెలిపారు. ఈ డీల్ కు ఎమ్మెల్యే ఒప్పుకుంటే తన నెంబర్ కు ఫోన్ చేయాలని సెల్ నెంబర్ ను ఆ చీటీ వెనుక రాసి ఇచ్చారు. 

ప్రబోధానంద స్వామి ఆరోపణలు తెలిసిన తర్వాత యేడాది క్రితం జరిగిన ఈ విషయాన్ని బయటపెడుతున్నట్లు శ్రీనాథ్‌ తెలిపారు. ఇదిలా ఉంటే చిన్న పొలిమెడలో ఘర్షణతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ప్రబోధానంద ఆశ‌్రమంలో ఉన్నతాధికారుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆశ్రమంలో పలు కీలకమై విషయాలను కమిటీ గుర్తించినట్లు తెలుస్తోంది. అత్యాధునికమైన ముద్రణాలయంతో పాటు ఆశ్రమంలో దాడిచేయడానికి ఉపయోగించే కట్టెలు, ఇనుపరాడ్లను గుర్తించారు. అసలు ఆశ్రమ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా..? ఉంటే ఎవరు అనుమతి ఇచ్చారు..? నాలుగు, ఐదు అంతస్తుల భవనాల నిర్మాణానికి అందులో ఏర్పరుచుకున్న సౌకర్యాలకు తగిన అనుమతులు ఎవరు ఇచ్చారు..? అన్న విషయాలపైనా అధికారుల విచారిస్తున్నారు. ఇటు ఘర్షణ నేపథ్యంలో ఆశ్రమవాసులపై మొత్తం 23 కేసులు నమోదైనట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. 

Similar News