ఇప్పుడున్న ఎన్నికల్లో పోటీచేసి గెలవాలంటే కోట్లాది రూపాయలు కావాలనేది జగమెరిగిన సత్యం. అలాంటిది కేవలం 12వందల రూపాయల ఆస్తితో ఏకంగా సీఎంపైనే పోటీకి దిగుతోందోమహిళా. ఛత్తీస్‌గఢ్ లోని రాజ్‌నందన్‌గావ్ నియోజకవర్గంలో రమణ్ సింగ్(బీజేపీ), కరుణా శుక్లా (కాంగ్రెస్) మధ్య హోరాహోరా పోటీ నెలకొన్న తరుణంలో.. ప్రతిమా వాస్నిక్ అనే 37 ఏళ్ల మహిళ స్వతంత్ర అభ్యర్థిగా ఇదే నియోజకవర్గంనుంచి పోటీ చేస్తోంది. దాంతో అందరి దృష్టి ఆమెపైనే పడింది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ వెల్లడించిన వివరాలప్రకారం.. ఆమె ఆస్తి కేవలం 12వందలు కాగా.. తన వద్ద రూ.20వేల ఎన్నికల ఖర్చు కోసం ఉన్నాయి. ఆమె భర్త స్థానికంగా ఓ హోటల్‌లో వంతమాస్టారుగా పనిచేస్తున్నారు. వీరికి ఓ కుమారుడున్నాడు. నామినేషన్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆస్తి రూ. 10.72 కోట్లు కాగా, కరుణా శుక్లా ఆస్తి రూ.3 కోట్లుగా ఉంది. కాగా 'సమాజంలో మార్పు' అనే లక్ష్యంతో ఎన్నికల బరిలో నిలిచిన ప్రతిమ.. నెలరోజుల క్రితం నుంచే పాదయాత్ర చేసుకుంటూ.. ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఉద్యోగావకాశాలు మెరుగుపడటం, ఈ వర్గాలకు ప్రైవేటురంగంలో రిజర్వేషన్లు కల్పించడం, రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యాలను మెరుగుపరచడం. అగ్రవర్ణాలతో సమానంగా వీరికి గుర్తింపు తదితర అంశాలను ఆమె ప్రచార అస్త్రాలుగా వినియోగించుకుంటున్నారు.