ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది. నాలుగేళ్లలో రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సాయాం ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు స్వయంగా ప్రధాని మోడీ రాష్ర్టానికి తరలిరానున్నారు. గుంటూరు వేదికగా సమరశంఖం పూరించనున్నారు. బీజేపీ-టీడీపీల మధ్య మాటల యుద్ధం సాగుతున్న వేళ మోడీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరికొద్ది నెలల్లో ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కాషాయ దళం సన్నద్దమవుతోంది. గుంటూరు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. గుంటూరు సభతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలోనూ సభలు నిర్వహించే యోచనలో ఉన్నారు బీజేపీ నేతలు.
గుంటూరు సభలో ఏపీలో రాజకీయాలు మారిపోతాయని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. మోడీ సభకు కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి సైతం భారీగా జనసమీకరణ చేయాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దాదాపు రెండు లక్షల మందిని సభకు తరలించేందుకు కసరత్తు చేస్తున్నారు. రాజధాని నగరం శంఖుస్థాపనకు మట్టీ..నీళ్లు తీసుకు వచ్చిన ప్రధాని మోడీ నాలుగేళ్ల తర్వాత ఏపీలో అడుగు పెట్టపోతున్నారు. విభజన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదన్న ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తుండంపై సర్వత్రా ఆసక్తి నెలకొనగా..మోడీ సభతో ఏపీలో బీజేపీ మరింత బలపడుతుందని బీజేపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు.
మోడీ రాకపై విపక్ష పార్టీలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏమొహం పెట్టుకని మోడీ ఏపీ పర్యటనకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక హోదా ప్రకటించిన తర్వాతే మోడీ రాష్ట్రంలో అడుగు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మోడీ రాకను వ్యతిరేకిస్తూ రాష్ర్ట వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలకు పిలుపునిచ్చారు.మరో వైపు కేంద్రప్రభుత్వ వైఖరిని నిసిస్తూ జనవరి1న టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసర కార్యక్రమాలు చేపట్టబోతుంది. రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాత మోడీ ఏపీకి రావాలంటున్నారు టీడీపీ నేతలు. మొత్తం మీద ప్రధాని మోడీ పర్యటన ఏపీలో పొలిటికల్ హీట్ పెంచేసింది. రాజకీయ పార్టీలు ఒకరిపైఒకరు మాటలతో విరుచుకుపడుతున్నారు.