గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు వినియోగదారులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. రేట్స్ రూపాయల్లో పెంచుతూ.. పైసల్లో తగ్గిస్తున్నారు. దాంతో ప్రజల్లో క్రమంగా అసహనం పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశమున్నట్టు తెలుస్తోంది. వచ్చే వారం నుంచి ఇరాన్‌పై అమెరికా మరోసారి ఆంక్షలు విధించనున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి పూర్తిగా ఆయిల్ దిగుమతులను నిలిపేయాలని ఇండియా సహా అన్ని మిత్ర దేశాలను అమెరికా ఆదేశించింది. అమెరికా విధించిన ఈ ఆంక్షల కారణంగా ఇరాన్ ముడి చమురు ఎగుమతులు భారీగా తగ్గుతాయని ఆయిల్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది మధ్యలో రోజుకు 25 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఎగుమతి చేస్తున్న ఇరాన్.. ఏడాది చివరినాటికి 15 లక్షల బ్యారెళ్లను మాత్రమే చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని భారత్ సహా ఆయిల్ కొరత ఉన్న ఎనిమిది దేశాలు అమెరికాను కోరుతున్నాయి. వీరి అభ్యర్ధనను పరిశీలించిన అమెరికా.. ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు 8 దేశాలకు అనుమతిచ్చింది. దాంతో అమెరికా తీసుకున్న నిర్ణయం ఈ దేశాలకు పెద్ద ఊరట కలిగిస్తుందని భావిస్తున్నాయి ఆయిల్ కంపెనీలు.