2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ వ్యూహామేంటీ ? ఆగష్ట్ 15న మేనిఫెస్టోను ప్రకటిస్తానన్న జనసేనాని ఆ దిశగా అడుగులు వేస్తున్నారా ? మేనిఫెస్టో ఎలా ఉంటుంది ? ఏపీ రాజకీయాల్లో పవన్ కార్యాచరణపై చర్చ జరుగుతోంది.
ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఇప్పుడో హాట్ టాపిక్. జనసేనాని వేస్తున్న అడుగులు అధికార తెలుగుదేశం పార్టీకి చెమటలు పట్టిస్తున్నాయ్. నాలుగేళ్లు టీడీపీ మద్దతిచ్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడు అదే పార్టీని టార్గెట్ చేశారు. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఇరుకున్న పెడుతూనే ఉన్నారు. నాలుగేళ్లుగా ఏపీలో అవినీతి పెరిగినంత అభివృద్ధి జరగలేదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సొంత అజెండాను తయారు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆగస్ట్ 15న జనసేన మేనిఫెస్టోని విడుదల చేయడానికి పవన్ సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు తమ పార్టీ ఎవరితో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుందో క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయ్. ప్రత్యేక హోదా కోసం లెఫ్ట్ పార్టీలతో కలిసి పని చేస్తున్న పవన్ కల్యాణ్ 2019లోనూ కొనసాగిస్తారా అన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు తాజా రాజకీయాల పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్‌ను ఓన్ చేసుకునేందుకు వైసీపీ తెరవెనుక ప్రయత్నాలు చేస్తోంది.
2019లో పవన్ కల్యాణ్ తీసుకోబోయే నిర్ణయంపై అన్ని పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయ్. వచ్చే ఎన్నికల్లో 50 నుంచి 55 స్థానాల్లో మాత్రమేపోటీ చేయాలని భావించి అందుకనుగుణంగా కార్యాచరణ తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇతర పార్టీల నేతలను జనసేనలోకి తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. టచ్‌లో ఉన్న నేతలను పిలిపించుకొని మాట్లాడుతున్నట్లు సమాచారం. మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ భేటీ వెనుక ఇదే కారణమని తెలుస్తోంది.