జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే గతంలో మైత్రీ మూవీమేకర్స్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సినిమా చేస్తున్నట్లు టాక్. డైరక్టర్ ఎవరనే విషయం తెలియాల్సి ఉండగా..మల్టిస్టారర్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది.
గతంలో సినీ నిర్మాత, ఎంపీ టీ సుబ్బిరామిరెడ్డి పవన్ కల్యాణ్ - చిరంజీవితో మల్టిస్టార్ తీస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తల్ని నిజం చేసేలా త్రివిక్రమ్ డైరక్షన్ లో చిరంజీవి, పవన్ కల్యాణ్ ల సినిమా త్వరలో ప్రారంభకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా కథను సిద్ధం చేసుకున్న త్రివిక్రమ్ సుబ్బిరామిరెడ్డితో చర్చలు జరిపారట. ఆ కథ నచ్చిన సుబ్బిరామిరెడ్డి త్వరలో సినిమాను తెరెకెక్కించేలా స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకోమని సూచించారట.
అజ్ఞాత వాసి సినిమా చిత్రీకరణ సమయంలో పవన్, త్రివిక్రమ్‌తో నిర్మాత, పారిశ్రామికవేత్త సుబ్బిరామిరెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మెగా బ్రదర్స్ కాంబినేషన్‌లో సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నదని చెప్పడానికి చాలా సంతోషంగా ఉన్నాను. ప్రస్తుతం చిరంజీవి, పవన్ కల్యాణ్ వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. వారి ప్రాజెక్టులు ఓ కొలిక్కి వచ్చిన వెంటనే నా సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అని అన్నారు.
అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఆ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న సుబ్బిరామిరెడ్డి వరంగల్‌లోని వేయి స్తంభాల ఆలయాన్నిదర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 11న వరంగల్‌లో కాకతీయ కళావైభవం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ హీరోలుగా త్వరలోనే సినిమా తీస్తామని పేర్కొన్నారు. కథ సిద్ధం కాగానే చిరంజీవి, పవన్ కలయికతో చిత్రం షూటింగ్ ప్రారంభిస్తామన్నారు.