అసలు పద్మ అవార్డులకు అర్హత ఏంటి..తెలుగు ప్రభుత్వాల సిఫారసులను కేంద్రం ఎందుకు పక్కనపెట్టింది?
ప్రతిభావంతులకు కొదువలేదు. కళాకారులకు లెక్కేలేదు. సామాజిక సేవకులూ ఎందరో. కానీ పద్మ అవార్డుల్లో మన తెలుగు రాష్ట్రాలకు దక్కినవెన్నో తెలుసా. ఒకే ఒక్కటి. అందులో తెలంగాణకైతే ఒక్క పురస్కారమూ లభించలేదు. 24 మంది పేర్లను ప్రతిపాదిస్తే, తిరస్కారమే తప్ప పురస్కారానికి పరిశీలించలేదు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం. సిఫారసులకు చెల్లు చీటి ఇచ్చి, సామాన్యులకు పెద్దపీట వేశామని చెప్పుకుంటున్న బీజేపీ సర్కారు, త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకే పురస్కారాలు ఎక్కువిచ్చిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందా...అర్హులే లేరనుకుందా....పక్కనపెట్టేసిందా.
పద్మం, కమలం...పేర్లు వేరయినా రెండు పువ్వులే ఒక్కటే...లోటస్. బీజేపీ గుర్తు కూడా అదే. ఇప్పుడు ప్రకటించిన పద్మాలు కూడా కమలంలాగే ఉన్నాయన్న విమర్శలొస్తున్నాయి. పద్మానికి బురద అంటుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్వీ రంగారావు, సావిత్రిలు పద్మ పురస్కారాలకు అర్హులు కారా అని, జనసేన అధినేత ప్రశ్నిస్తుంటే, ప్రొఫెసర్ జయశంకర్, అందెశ్రీ, గోరటి వెంకన్నలకు ఏం తక్కువా అని తెలంగాణ ప్రజలు ఆగ్రహంగా అడుగుతున్నారు. మరి కేంద్రం బదులేంటి?
పద్మ అవార్డులు. భారతదేశంలో ప్రతిష్టాత్మక పురస్కారాలు. వివిధ రంగాల్లో కృషి చేసినవారికి, సమాజంలో తమదైన ముద్ర వేసిన వారికీ, పేదలకు సేవలు చేస్తున్నారువారు, ఉచిత సర్వీసులు అందిస్తున్నవారు, కళలకు ప్రాచుర్యం కల్పిస్తున్నవారు, ఇలా రకరకాల సామాన్యులు, ప్రముఖలకు పద్మ అవార్డులు వరిస్తాయి.
పద్మ అవార్డులపై ప్రతి ఏడాది ఏదో ఒక వివాదం
పద్మ అవార్డుల్లో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అనే మూడు అవార్డులను ప్రదానం చేస్తుంది ప్రభుత్వం. ప్రతి ఏడాది ఇచ్చే పురస్కారాలే ఇవి. ఇచ్చిన ప్రతిసంవత్సరమూ, ఏదో ఒక వివాదం. ఇచ్చినవారిలో అర్హులెవరున్నారని కొందరు ప్రశ్నిస్తే, మాకు అర్హతలేదా అంటూ మరికొందరు ప్రశ్నించడం రివాజుగా మారింది. ఈ ఏడాది కూడా పద్మ అవార్డులు, రచ్చకు దారి తీశాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగిందన్న వాదన వినిపిస్తోంది.
ఈ ఏడాది మొత్తం 85 మందికి పద్మ అవార్డులు
ఈ ఏడాది మొత్తం 85 మందికి పద్మ అవార్డులు ప్రకటించింది కేంద్రం. ఇందులో ముగ్గురికి పద్మ విభూషణ్, తొమ్మిది మందికి పద్మభూషణ్, 73 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. పద్మ అవార్డులు లభించిన వారిలో 14 మంది మహిళలు ఉన్నారు. 16 మంది విదేశీయులను పద్మ అవార్డులతో సత్కరిస్తున్నారు. ముగ్గురికి మరణానంతరం పద్మ అవార్డులు దక్కాయి. కానీ ఇందులో తెలుగువాడు ఒకే ఒక్కడు మాత్రమే ఉన్నాడు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్కరికి పద్మ పురస్కారం
ఈ ఏడాది పద్మ పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఒకే ఒక్కరికి అవార్డు దక్కింది. బ్యాడ్మింటన్ ఛాంపియన్ కిడాంబి శ్రీకాంత్‌ను వరించింది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్‌కు ఒకే ఒక్క అవార్డు దక్కింది. తెలంగాణకైతే, ఒక్కటీ లేదు. అదే తెలుగు ప్రజల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. ఒక్కరూ అర్హతకలిగినవారు లేరా అంటూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పద్మ అవార్డుల ప్రకటనపై తొలుత స్పందించింది జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలుగువారికి అన్యాయం జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగువారిలో మరికొంతమందికి పద్మ అవార్డులు వస్తే బాగుండేదన్న పవన్....సావిత్రి, ఎస్వీఆర్‌కు పద్మ అవార్డులు దక్కేలా కేంద్ర ప్రభుత్వానికి సూచించాలని కోరారు.
తెలుగు రాష్ట్రాల్లో అసలు అర్హులే లేరా?
పద్మ అవార్డుల ప్రకటన, నిజంగానే తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. అసలు అర్హులే లేరా...లేదంటే అసలు పట్టించుకోలేదా..అన్నది చర్చనీయాంశమమైంది. మొదటి నుంచి తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ప్రభుత్వం శీతకన్ను వేసిందని కొందరంటే, మరికొందరు అంతా పారదర్శకంగానే పురస్కార గ్రహీతలను ఎంపిక చేశారని వాదిస్తున్నారు.
పద్మ అవార్డులకు 24మంది ప్రముఖుల పేర్లను సిఫారు చేసిన తెలంగాణ
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, చాలామంది పేర్లను కేంద్రానికి సిఫారసు చేశాయి. మొదట తెలంగాణ విషయానికి వస్తే, 24మంది ప్రముఖుల పేర్లను సిఫారసు చేసినట్టు తెలిసింది. మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నట్టు, దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న కోసం మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరును, ప్రతిపాదించింది కేసీఆర్ ప్రభుత్వం. అలాగే రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌కు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ పేరును నామినేట్ చేసినట్టు తెలుస్తోంది.
అలాగే పద్మవిభూషణ్‌కు సిఫారు చేసినవారిలో ఆర్థికవేత్త చెన్నమనేని హనుమంతరావు.. కవి, నవలా రచయిత ప్రొఫెసర్ శివ్ కె. కుమార్ కూడా ఉన్నారని సమాచారం. ఇక పద్మశ్రీ అవార్డుల విషయానికి వస్తే, ప్రజా గాయకులు గోరటి వెంకన్న పేరును ప్రతిపాదించింది. అక్షరం దిద్దకుండా, ఎన్నో పాటలు, పద్యాలు అశువుగా అల్లిన అందెశ్రీను నామినేట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇంకా విద్యావేత్త చుక్కా రామయ్య, సినీ రచయిత సుద్దాల ఆశోక్ తేజలను పద్మశ్రీకి సిఫారసు చేసిందని తెలుస్తోంది.
పద్మభూషణ్‌కు పీవీ సింధూ పేరు సిఫారసు
ఒలింపిక్స్ పతకం సాధించి, మువ్వన్నెల జెండా రెపరెపలాడించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూను పద్మభూషణ్‌కు సిఫారు చేసింది తెలంగాణ సర్కారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నామినేట్ చేసింది. కానీ అసలు పీవీ సింధూ పేరును పరిశీలించలేదు కేంద్ర ప్రభుత్వం.అనేక అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీల్లో సత్తా చాటిన తెలుగు తేజం గుత్తాజ్వాలకు ప్రతి సంవత్సరం నిరాశే ఎదురవుతోంది.
25 మంది పేర్లను నామినేట్ చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దాదాపు 25 మంది పేర్లను పద్మ అవార్డులకు సిఫారు చేసింది. వీరిలో కూచిపూడి నాట్యకారిణి ఆనంద్ శంకర్ జయంతి, ఎంపీ మురళీమోహన్, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు, ప్రముఖ వైద్యులు విష్ణుస్వరూప్ రెడ్డి, జగదీశ్‌తో పాటు మరికొందరి ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, కళాకారులున్నారు. కనీసం కొందరికైనా అవార్డు వరిస్తుందని ఏపీ సర్కారు భావించింది. కానీ నిరాశే ఎదురైంది.
గతేడాది మొత్తం 89 మందికి అవార్డులు ప్రకటించింది కేంద్రం ప్రభుత్వం. అందులో ఎనిమిదిమంది తెలుగువారున్నారు. వి. కోటేశ్వరమ్మ, చింతకింది మల్లేశం, చంద్రకాంత్, చెట్ల రామయ్య, బీవీ మోహన్ రెడ్డి, హనుమాన్ చౌదరి, యాదగిరి రావు, మహమ్మద్ అబ్దుల్ వాహెద్ ఉన్నారు. కానీ ఈసారి మాత్రం తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అసంతృప్తి కలిగించింది కేంద్రం తీరు. ముఖ్యంగా తెలంగాణకు ఒక్క పురస్కారమూ దక్కకపోవడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత, ఇలా జరగడం మొదటిసారి.
తెలంగాణ సర్కారు 24 మంది పేర్లను కేంద్రానికి పంపిస్తే, 15 మంది నేరుగా దరఖాస్తు చేసుకున్నారు. కానీ వీరిలో ఒక్కర్నీ సెలక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోలేదు. రాష్ట్ర అవతరణ తర్వాత, 2015లో ముగ్గురికి పద్మశ్రీ అవార్డులు వరించగా, 2016లో ఆరుగురికి, 2017లో ఆరుగురికీ దక్కాయి. ఈసారి మాత్రం ఒక్క అవార్డు ప్రకటించకపోవడం, అసంతృప్తి రాజేసింది. రాజకీయంగా తనకు లాభం ఉన్న రాష్ట్రాలకే అవార్డులిస్తోందని, అందుకే తెలుగు రాష్ట్రాలకు మొండిచెయ్యి చూపిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మొదటి నుంచి పద్మ అవార్డులపై వివాదమే.
కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ ఏ ప్రభుత్వమున్నా, వాటి ప్రయోజనాలకు అనుగుణంగానే అవార్డులు, రివార్డులు, పురస్కారాలు అందిస్తాయన్న విమర్శ దశాబ్దాల నుంచే ఉంది. అయితే సిఫార్సు లేఖలకు, పైరవీలకు చెల్లుచీటి ఇచ్చామని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటోంది. ఎలాంటి ప్రచారాన్ని కోరుకోకుండా తమదైన రంగాల్లో విశేష కృషి చేస్తున్నవారిని గుర్తించి పురస్కారాలు ప్రకటించామంటోంది.
ప్రభుత్వం చెప్పినదాంట్లో కొంత వాస్తవమూ ఉంది. 97 ఏళ్ల వయసులోనూ కర్ణాటకలోని వెనుకబడిన ప్రాంతాల్లో పేద మహిళలకు పురుడుపోసే నరసమ్మ, 99 ఏళ్ల పండు ముసలితనంలోనూ పశ్చిమబెంగాల్‌లో సామాజికసేవలో మునిగిపోయిన సుధాన్షు బిశ్వాస్, సహజ ఔషధాలపై దక్షిణాది రాష్ట్రాల్లో ఉపన్యాసాలు ఇచ్చే స్థాయికి ఎదిగిన నిరుపేద తమిళ గిరిజన మహిళ లక్ష్మికుట్టి లాంటివాళ్లకు అవార్డులిచ్చింది.
పద్మ అవార్డుల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్
గతంలో డబ్బుతోపాటు ప్రతిష్ఠను వెనకేసుకునే క్రికెట్, సినీ తారలకే ఎక్కువగా అవార్డులొచ్చేవి. ఇప్పుడు మాత్రం సామాన్యులకూ పురస్కారాలు లభిస్తున్నాయని ప్రభుత్వమంటోంది. అందుకు నిదర్శనం, ఎవరికి వారు పేర్లను ప్రతిపాదించుకోవడమేనని అంటోంది. పద్మ అవార్డుల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్ ప్రారంభించింది కేంద్రం. దీని ద్వారా వచ్చిన అప్లికేషన్లనే పరిశీలించింది. తమ చుట్టుపక్కల వారు చేస్తున్న నిస్వార్థ సేవను గుర్తించి సామాన్యులు ప్రతిపాదించిన పేర్లనూ పరిశీలించింది. ఇలా వచ్చిన 15 వేలకు పైగా దరఖాస్తులను ప్రధానమంత్రి నేతృత్వంలోని కమిటీ వడపోసి అందులోని ఆణిముత్యాల్లాంటివారిని పౌర పురస్కారాలకు సెలక్ట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రులు చేసిన సిఫార్సుల ఆధారంగా పురస్కారాలు ప్రకటించే కల్చర్‌కు చెల్లు చీటి ఇచ్చామంటోంది. కానీ ఇచ్చిన అవార్డులన్నీ ఇదేకోవలోనే ఉన్నాయా అంటే సమాధానం కాదనే.
తెలుగు రాష్ట్రాల్లో అర్హులు లేరా?
దేశంలో హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగు. తెలుగు రాష్ట్రాల్లోనూ మట్టిలో మాణిక్యాలు, ఎవరూ గుర్తించకపోయినా సామాజికసేవలో తరిస్తున్నవారు, ప్రతిభావంతులు ఎందరో ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈసారి తెలుగు రాష్ట్రాలకు తీరని నిరాశ కలిగించింది. త్వరలో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకే పెద్దపీట వేసిందన్న విమర్శలొస్తున్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా అవార్డుల జాబితా ఉంది. ఎందుకంటే త్వరలో ఎలక్షన్స్ జరిగే మహారాష్ట్రకు 11 అవార్డులు, కర్ణాటకకు తొమ్మిది, తమిళనాడుకు ఆరు, పశ్చిమబెంగాల్‌కు ఐదు, మధ్యప్రదేశ్‌కు నాలుగు అవార్డులిచ్చారు. రాజకీయంగా బలోపేతం కావాలనుకుంటున్న కేరళ, ఒడిశా, యూపీలకు నాలుగు పురస్కారాలు లభించాయి. గుజరాత్‌కూ మూడు దక్కాయి. ఇతర దేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలకూ అవార్డులొచ్చాయి. కానీ ప్రతిభా పాటవాలకు, కళాకారులకు కొదువలేని తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఒకే ఒక్కటి. తెలంగాణకైతే జీరో. పురస్కారాల్లోనూ రాజకీయమెందుకన్న ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. ఎందుకంటే, తెలంగాణ, ఏపీలో బీజేపీకి అంత స్కోపులేదు కాబట్టి, పురస్కారాలు ఇవ్వలేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
గతేడాది కూడా తెలుగు రాష్ట్రాలకు అవార్డులొచ్చాయి. ఎందుకంటే, తెలుగు రాష్ట్రాల వాదన కేంద్రమంత్రిగా వెంకయ్య నాయుడైనా బలంగా వినిపించేవారు. ఇప్పుడాయన ఉపరాష్ట్రపతి కావడంతో, తెలుగుకు వాయిస్ పెద్దగాలేదు. గతంలోనూ అవార్డులపై ఎన్నో విమర్శలు. పైరవీలు చేస్తే వస్తాయని, కొనుక్కుంటే వరిస్తాయని, సంకీర్ణ పార్టీలు లాబీయింగ్ చేస్తే వాలిపోతాయని ఆరోపించినవారూ ఉన్నారు. ప్రముఖ తెలుగు నటుడు కోటా శ్రీనివాస రావుకు కూడా దశాబ్దాల తర్వాత మొన్న పద్మశ్రీ వరించింది. విలక్షణ నటనతో మెప్పించిన ఎస్వీ రంగారావుకు దక్కలేదు. అలాగే మహానటి సావిత్రికీ లభించలేదు. కానీ సైఫ్ అలీఖాన్, ఐశ్వర్య వంటి నటులను మాత్రం వరించాయంటే, హిందీ లాబీయింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థమవుతోందని కొందరి విమర్శ. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వివక్షకు తావులేని, లాభాపేక్షకు అవకాశంలేని, విమర్శలు, ఆరోపణలకు ఆస్కారం లేకుండా అవార్డులు ప్రకటించాలని అందరూ కోరుకుంటున్నారు.