పాదయాత్రలు అధికారానికి దగ్గర దారిగా మారుతు న్నాయా? మొన్న వైఎస్, నిన్న చంద్రబాబు.. నేడు జగన్.. ప్రజలతో మమేకమయ్యేందుకు వారి మనసు గెలుచుకోడానికి పాదయాత్రలే మార్గంగా ఎంచుకుంటున్నారు.. రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా జగన్ ఏం తెలుసుకున్నారు? పాదయాత్ర జగన్ శైలిలో మార్పు తెచ్చిందా?
యువనేత జగన్ పై జనాభిమానం ఉప్పెనగా మారుతోందా? మండుటెండల్లో కొనసాగుతున్న ఆయన పాదయాత్ర రెండువేల కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఊరూరా, వాడ వాడా జగన్ వెనుక జన సంద్రం కోలాహలంగా కదలి వెడుతోంది. మండుతున్న ఎండల్ని సైతం పట్టించుకోకుండా జగన్ తో మమేకమవడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. నవంబర్ 6నుంచి మొదలైన ప్రజాసంకల్ప యాత్ర లక్ష్యం ఏపి మొత్తం నలు చెరగులా పర్యటించి ప్రజాసమస్యలను తెలుసుకోవడం.. వాటికి పరిష్కార మార్గాలు కనుగొనడం.. ప్రజలతో మమేకమవడం.. వచ్చే ఎన్నికల నాటికి తనకూ, తన పార్టీకి ఒక విస్పష్టమైన ముద్రను ఏర్పరచు కోవడం. ఆరునెలల పాటూ కొనసాగే ఈ ప్రజాసంకల్ప యాత్ర ఇప్పటికి రెండు వేల కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంకటాపురంలో 40 అడుగుల పైలాన్ కూడా ఆవిష్కరించారు.
ఇప్పటి వరకూ 8 జిల్లాలు నడిచిన జగన్ తొమ్మిదో జిల్లాగా పశ్చిమ గోదావరిలోకి ప్రవేశించారు. జగన్ యాత్రకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఇవాళ, రేపు పాదయాత్రలు చేస్తున్నారు.
జగన్ ఈ యాత్రను శీతాకాలంలో మొదలు పెట్టినా.. ప్రస్తుతం మండుటెండలు వచ్చేసరికి..మరింత మండిపోయే ఎండలుండే కృష్ణాజిల్లా, విజయవాడ, ఏలూరు తదితర ప్రాంతాలను చేరుకున్నారు.. మామూలుగా అయితే మండుతున్న ఎండలకు జనం కర్ఫ్యూ విధించినట్లు ఇళ్ల పట్టునే ఉంటున్నారు.. కానీ జగన్ ప్రజా సంకల్పయాత్రకు మాత్రం జనం విపరీతంగా తరలి వస్తున్నారు.. ఎండను సైతం లెక్క చేయకపోవడం విడ్డూరం.. 2019 ఎన్నికలే లక్ష్యంగా అడుగులేస్తున్న జగన్ ఈసారి తనకు కలసి వచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోడం లేదు..పాదయాత్రలో స్థానికులను పేరు పేరునా పలకరించడంతోపాటూ, వారికష్ట సుఖాలను తెలుసుకుంటున్నారు. ప్రజలు లేవనెత్తిన అంశాలను జగన్ బృందం నోట్ చేసుకుంటోంది.ప్రతీ అంశాన్ని తామెలా పరిష్కరించబోతున్నామో జగన్ అక్కడికక్కడే వివరిస్తున్నారు. అంతేకాదు ప్రతీ జిల్లాకు కనీసం ఒకటి లేదా రెండు బహిరంగసభలు ఉండేలా యాత్రను ప్లాన్ చేసుకున్నారు.. చంద్రబాబు ప్రభుత్వాన్ని పదునైన విమర్శలతో ఎండగట్టి ప్రజలను ఆకట్టుకుంటున్నారు. జగన్ పాదయాత్ర లక్ష్యం సుస్పష్టం.. పార్టీని కాపాడుకోవడం..సాధ్యమైనంత వరకూ ఈసారి అధికారం సాధించడం.. జగన్ యాత్ర సందర్భంగా వైసిపిలోకి చేరికలు కూడా పెరుగుతున్నాయి.
పాదయాత్రలో రోజూ తన దృష్టికి వచ్చే సమస్యల స్థాయిని బట్టి మూడు కేటగిరీలుగా విభజించారు. తక్షణ పరిష్కార సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారు. అధికారులతో చర్చించాల్సిన సమస్యల పరిష్కార బాధ్యతను పార్టీ నేతలకు అప్పగిస్తున్నారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమస్యలపై నిపుణులతో చర్చిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో విధానాలను సరిపోల్చి, నిపుణులతో విశ్లేషించి ఒక విధానాన్ని రూపొందిస్తున్నారు. ఆ విధాన నిర్ణయాలను పాదయాత్రలోనే ప్రకటిస్తున్నారు. వాటిని పార్టీ మ్యానిఫెస్టోలోపొందుపరచనున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. జగన్ ఇస్తున్న వాగ్దానాలే సందేహాలను కలిగిస్తున్నాయి.. చంద్రబాబు ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదని విమర్శిస్తున్న జగన్ తాను మాత్రం ఆచరణకు వీలులేని హామీలనిస్తున్నారన్న ఆరోపణలనెదుర్కొంటున్నారు.. రైతులకు ఏడాదికి 12,500 పెట్టుబడి రూపంలో అందిస్తామని 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని జగన్ తన పాదయాత్రలో హామీ ఇచ్చారు. అంతేకాదు రాష్ట్రంలో 5 లక్షల చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రయోజనం కలిగించే విధంగా వడ్డీ లేని రుణాలు అందిస్తామని వెల్లడించారు. మగ్గం ఉన్న ప్రతీ ఇంటికి నెలకు రెండు వేలు సబ్సిడీతో పాటూ 45 ఏళ్లు నిండిన చేనేత కార్మిక మహిళలకు పింఛన్ ఇస్తామన్నారు.
అలాగే నిరుద్యోగ యువతకు రెండు వేలు పింఛన్ ఇస్తామన్నారు.. ఇలా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఏదో రూపంలో ఉచితం అందించేలా జగన్ హామీలు ఉంటున్నాయ్.. ఇలా అన్ని సెక్షన్లకు జగన్ ఏదో ఒకటి వాగ్దానం చేస్తూ పోతుంటే రేపు వాటి అమలు సంగతేంటి? హామీలివ్వడంలో జగన్ హద్దు మీరుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలే అప్పుల కుప్పలా మారిన రాష్ట్రంలో ఆ వాగ్దానాలను అమలు చేసే ఆస్కారం ఉంటుందా?అధికారం సాధించాలన్న తపనలో జగన్ నేల విడిచి సాము చేస్తున్నారా? టిడిపిని విమర్శించిన జగన్ తానూ అదే తప్పును కొనసాగిస్తున్నారా? అసలు జగన్ వాగ్దానాలు ఆచరణ సాధ్యమా?