తల్లి కూడా చేయని మేలు చేసే ఉల్లి తనను సాగు చేసే రైతు పాలిట మాత్రం శాపంగా మారుతుంది. విత్తు నుంచి కోత వరకు తనను కాపాడుకుంటూ వచ్చిన రైతుకు కన్నీటి పాల్జేస్తూ అప్పులను బహుమతిగా ఇస్తోంది. ఉల్లి సాగు చేసి అప్పుల పాలయ్యి ప్రాణాలు తీసుకున్న ఘటన కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని కవులూరులో జరిగింది. గ్రామానికి చెందిన నాగేశ్వరరెడ్డి ఈ ఏడాది ఎనిమిది ఎకరాల్లో ఉల్లి సాగు చేశాడు. ఎకరాకు 80 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. మంచి దిగుబడి సాధించినా తగిన ధర లేకపోవడంతో గిట్టుబాటు కాక అప్పుల పాలయ్యాడు. పంటను నిల్వ చేసుకునే వసతి అందిన కాడికి అమ్ముకున్నాడు. దీంతో తీవ్ర అప్పులపాలయిన నాగేశ్వరరెడ్డి భవిష్యత్‌ను తలుచుకుంటూ పొలం దగ్గరకు వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు నాగేశ్వర రెడ్డికి భార్యతో పాటు ఐదేళ్ల కుమారుడు, రెండేళ్ల కూతురు ఉన్నారు. కుటుంబం పెద్ద తమకు దూరం కావడంతో భార్య,బిడ్డలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు .