తెలంగాణ బీజేపీలో ఆయనో ముఖ్యనాయకుడు. అయినా తన రూటే సెపరేటు అన్నట్టు వ్యవహరిస్తాడు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నా ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తుతాడు. పార్టీ కార్యక్రమాల కంటే ప్రభుత్వ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తుంటాడు. తన పార్టీ నేతల కంటే ప్రభుత్వంలోని నాయకులను పబ్లిగ్గా పొగడడం ఆయనకు అలవాటు. ఆయన తీరు చూసి కమలం పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
పక్కా ఆర్ఎస్ఎస్, కాషాయవాదిని చెప్పుకొని మొట్టమొదటి సారి ఉప్పల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎంపికైన బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్. ఇప్పుడాయన తీరు పార్టీలో ఎవ్వరికి మింగుడుపడడం లేదనే చర్చ కాషాయపార్టీలో జోరుగా సాగుతోంది. ఆయన రూటు అధికార పార్టీ వైపు.. ఆయన పొగడ్త ప్రభుత్వం వైపు ఉంటుందని టాక్. ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరి వచ్చినపుడు కరపత్రాలలో కేసీఆర్, కేటీఅర్‌లకు పెద్ద పీట వేసారు. ఇక బహిరంగ సభలో తాను ప్రభుత్వానికి విధేయుడినని ఓపెన్‌గా చెప్పారు. ఈ ప్రకటనతో అదే వేదికపై ఉన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఫ్లోర్ లీడర్ కిషన్‌రెడ్డి వంటి నేతలకు పెద్ద షాకిచ్చారనే చర్చ పార్టీలో జరుగుతోంది.
అది మరవకుండానే మరోసారి ప్రభాకర్ రాష్ట్ర బీజేపీలో చర్చకు కేంద్ర బిందువుగా మారారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం ప్రారంభోత్సవానికి టీఆర్ఎస్ నేతలతో కలిసి పాల్గొన్నారు. ఓ వైపు బీజేపీ నేతలు ప్రభుత్వ తప్పులను విమర్శిస్తుంటే.. ఈయన మాత్రం అధికార పార్టీని ప్రశంసించారు. ఎమ్మెల్సీ రాంచందర్ రావుకు కూడా ప్రభుత్వ ఆహ్వానం ఉన్నా.. ఆయన ఏదో వంకతో తప్పించుకున్నారు. కానీ ప్రభాకర్ మాత్రం కార్యక్రమానికి హాజరవడంతోపాటు.. రైతుబంధు ఓ అద్భుత పథకం అని కితాబిచ్చారు. ఇది స్థానిక బీజేపీ కేడర్‌తోపాటు రాష్ట్ర పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు.
గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే వ్యవహరించి పార్టీ నేతలతో చీవాట్లు తిన్న ప్రభాకర్.. తన తీరును మార్చుకోక పోవడం చూస్తుంటే త్వరలోనే ఆయన పార్టీ మారవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. అయితే అయన అనుచరులు మాత్రం నియోజకవర్గ ప్రయోజనాల కోసమే తమ ఎమ్మెల్యే ఇలా చేస్తున్నారని అంటున్నారు.