తెలుగు భాషను రక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే .. తెలుగు విద్యే అవసరం లేదంటున్నాడు అదే ప్రభుత్వంలో పనిచేసే అధికారి. ఇంగ్లిష్ ముద్దు తెలుగు బోధన వద్దంటూ ప్రత్యేక ప్రకటన కూడా జారీ చేసారు. ఈ చర్య పేద విద్యార్థులకు శాపంగా మారుతుందని అధ్యాపక లోకం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతంగా నిర్వహించిన ఉత్సాహంతో తెలంగాణ ప్రభుత్వం తెలుగు భాష పరిరక్షణకు ప్రత్యేక చట్టం చేసి మరీ అమలు చేస్తుంది. మరోవైపు కళాశాలల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ మాత్రం హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో తెలుగు మీడియంను ఎత్తేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. రేషనలైజేషన్ పేరుతో కొన్ని కోర్సులను కూడా ఎత్తేస్తున్నట్లు ప్రకటించడంపై విద్యార్థులు, అధ్యాపకులు అందోళన చెందుతున్నారు.
గతంలో ప్రతి గ్రూప్‌లో కోర్సులవారీగా 30 సీట్లు తెలుగు మీడియం, 30 సీట్లు ఇంగ్లీష్ మీడియం ఉండేవి. ఇంటర్ వరకు తెలుగు మీడియంలో చదివిన గ్రామీణ విద్యార్థులు పై చదువుల కోసం హైదరాబాద్ వస్తుంటారు. కొత్త నిర్ణయంతో తెలుగు మీడియం విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని అధ్యాపకులు అంటున్నారు. ఇంగ్లిష్ మీడియాన్ని స్వాగతిస్తున్నామని.. కాని తెలుగులో బోధన రద్దు సరైన చర్య కాదని విమర్శిస్తున్నారు. కోర్సుల పునరేకీకరణ అంటూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని. దీనిని ఉపసంహరణ కోసం అవసరమైతే ఉద్యమిస్తామని చెబుతున్నారు.
విద్యావ్యవస్థలో మార్పు రాత్రికి రాత్రి రాదని.. ఒక్క నోటిస్‌తో మార్చేద్దామనుకోవడం కరెక్ట్ కాదని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు కడియం రాజు అన్నారు. అట్టడుగు వర్గాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకోని నిర్ణయాలు తీసుకోవాలని.. మీడియంలు మార్చినంత మాత్రాన విద్యార్థుల నైపుణ్యం పెరగదని చెప్పారు. అధికారులు మారినప్పుడల్లా సిలబస్, కోర్సులు మార్చేయడం తప్పని అధ్యాపక సంఘాలు అంటున్నాయి. వచ్చే ఏడాది నుంచి కచ్చితంగా ఇంగ్లిష్ మీడియంలోనే బోధిస్తామని కమిషనర్ అంటున్నారు. మరి వీళ్లలో తెలుగును రక్షించేదెవరోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.