హోమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఎందుకింత అసహనం. ఓ కీలకమైన పదవిలో ఉంటూ రాయలేని భాషలో బండుబూతులు తిడుతున్నారు. ఓ సందర్భంలో కేసీఆర్ ను బండ బూతులు తిట్టిన ముండా కొడుకులే పెత్తనం చలాయిస్తున్నారని, మరో సందర్భంలో పోలీసులకు కొత్త వాహనాలు ఇస్తే ఆఫీసర్లు కొట్టేస్తారని.. అందుకే పోలీసు వాహనాలపై స్టేషన్ పేర్లతో స్టిక్కర్లు అతికించి పంపిస్తామంటారు. ఇప్పుడు రైతుల ఆత్మహత్యలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో నాయిని పరుష పదజాలంతో మాట్లాడిన మాటలపై అసహనం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే పరిపాలనా దృష్ట్యా మంత్రి వర్గ విస్తరణకు టైం పట్టనుంది. ఈ నేపథ్యంలో నాయిని వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తుంది. మంత్రి వర్గం నుంచి తనను భర్తరఫ్ చేస్తారనే లీకులతో అసహనం వ్యక్తం చేస్తున్నట్లు పొలిటికల్ క్రిటిక్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో అదనపు ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవంలో నాయిని ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు కొత్త వాహనాలు ఇస్తే ఆఫీసర్లు కొట్టేస్తారని.. అందుకే పోలీసు వాహనాలపై స్టేషన్ పేర్లతో స్టిక్కర్లు అతికించి పంపించామన్నారు. నాయిని వ్యాఖ్యలపై పోలీస్ ఉన్నతాధికారులు అసహనం వ్యక్తి చేసినట్లు వార్తలు వచ్చాయి.
దీంతో పాటు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం ముద్రించిన 2018 క్యాలెండర్ ఆవిష్కరణకు హాజరైన మంత్రి మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, ఎంపీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
నాడు కేసీఆర్‌ను బండబూతులు తిట్టిన వారే నేడు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, రాష్ట్ర కేబినెట్‌లో మంత్రులుగా కొనసాగుతున్నారంటూ బూతు పురాణం చదివారు. రాయడానికి వీల్లేని భాషలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను తిట్టినోళ్లు నేడు ముఖ్యమైన పదవుల్లో కొనసాగుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీని కూకటివేళ్లతో పెకళించేందుకే ఆ పార్టీ నేతలను టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నట్టు వివరణ ఇచ్చారు.
ఇప్పుడు డబ్బులు వస్తాయని కూలీ, మేస్త్రీ ఇలా.... ఎవరు చనిపోయినా.. రైతు ఖాతాలో వేస్తున్నారని అన్నారు. రైతు ఆత్మహత్యలుగా నమోదవుతున్న వాటిలో రైతులు కానివారే ఎక్కువగా ఉన్నారని నాయిని నరసింహారెడ్డి ఆరోపించారు. నాయిని వ్యాఖ్యలపై రైతుల సంఘాల నాయకులు మండిపడుతున్నారు. డబ్బుల కోసం ఆత్మహత్యగా చిత్రీకరించుకునే ప్రయత్నం ఎవరు చేయడం లేదని సూచిస్తున్నారు. ఓ వైపు రైతులు ఆత్మహత్యకు పాల్పడుంటే..మరోవైపు మంత్రి నాయిని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు.