ప్రఖ్యాత సితార విద్వాంసులు, భారతరత్న పండిట్ రవిశంకర్ మాజీ భార్య, ప్రఖ్యాత గాయని అన్నపూర్ణాదేవి(91) మరణించారు. ఆమె గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో శనివారం తీవ్ర అస్వస్థతతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కన్నుమూశారు. అన్నపూర్ణాదేవి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో పేరు గడించారు. ప్రముఖ హిందుస్తానీ సంగీతకారుడు ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ ఆమె సోదరుడే. దాదాపు 40 ఏళ్లపాటు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న అన్నపూర్ణాదేవి..ముంబైకి మకాం మార్చి కొద్ది మంది శిష్యులకు శిక్షణ ఇచ్చారు. అన్నపూర్ణాదేవిది సంప్రదాయ సంగీత నేపథ్యమున్న కుటుంబం. 1927లో మధ్యప్రదేశ్‌లోని మైహర్ పట్టణంలో ఉస్తాద్ బాబా అల్లాఉద్దీన్ ఖాన్, మదీనా బేగం దంపతులకు ఆమె జన్మించారు. బాల్యంలో ఆమె పేరు రోషనారాఖాన్ కాగా, అప్పటి మైహర్ మహారాజు బ్రిజ్‌నాథ్ సింగ్ ఆమెను అన్నపూర్ణ అని సంబోధించడంతో అప్పటినుండి రోషనారాఖాన్ కాస్త అన్నపూర్ణా గా మారిపోయింది. కాగా అన్నపూర్ణదేవి మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు.