అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను హత్య చేసింది తామేనని మావోయిస్టులు ప్రకటించారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ఓ లేఖ విడుదల చేసింది. ఏవోబీ అధికార ప్రతినిధి జగబంధు పేరుతో విడుదల చేసిన ఈ లేఖలో వారిని హత్యచేసినందుకు కారణాలను వెల్లడించారు. మైనింగ్ మాఫియాగా మారి ఆదివాసీల ప్రకృతి సంపదలను కొల్లగొట్టారని, అందుకే వారిని హతమార్చినట్టు లేఖలో పేర్కొన్నారు. తూర్పు కనుమలలో మైనింగ్ మాఫియాను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే బాధ్యులపై చర్యలు తప్పవని మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు. కాగా అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్య అనంతరం ప్రస్తుతం మన్యంలో ఉన్న ఎమ్మెల్యేలకు భద్రత పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి ఇంటివద్ద భద్రతనను పెంచారు. మరోసారి మావోయిస్టులు అలజడి సృష్టించకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.