జైలు మామిడి పళ్లు కోతకు వచ్చాయి. పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో పండించిన రుచికరమైన జైలు మామిడి పళ్లు మరో వారం పదిరోజుల్లో మార్కెట్‌కి రానున్నాయి. ఎన్నో రకాల మామిడి పళ్లు విన్నాం కానీ ఈ కొత్త జైలు మామిడి పళ్లేంటా అని అయోమయంలో పడ్డారా? అయితే ఓ సారి సంగారెడ్డి జిల్లా కందికి వెళ్లాల్సిందే.
సంగారెడ్డి జిల్లా కందిలో జిల్లా కేంద్ర కారాగారం ఉంది. సువిశాల ప్రాంగణంలో నిర్మించిన ఈ జైలులో విశాలమైన వ్యవసాయ క్షేత్రం ఉంది. ఇందులో సుమారు ఐదెకరాల్లో మామిడి తోట పెంచారు. జైలులోని ఖైదీలే తోట పనుల్లో పాలుపంచుకుంటారు. సుమారు నాలుగేళ్ల క్రితం పెట్టిన మామిడిచెట్లు ప్రస్తుతం నిండా మామిడి కాయలతో కోతకొచ్చాయి. ఈ మామిడి తోటను పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లో పెంచారు. ఎలాంటి క్రిమిసంహారక మందులు ఉపయోగించకుండా ఖైదీలే స్వయంగా సేంద్రీయ ఎరువులు తయారుచేసి ఈ పంటకు వినియోగించారు. ఇందుకోసం ఖైదీలకు ప్రత్యేకంగా ఉద్యానవన శాఖాధికారులతో శిక్షణ ఇప్పించారు. అంటుకట్టడం, సీడ్ బాల్ తయారు చేయడంలో సైతం సంగారెడ్డి జిల్లా ఖైదీలు నైపుణ్యం సాధించారు.
ఇప్పటి వరకు రెండు సార్లు పంట వచ్చినప్పటికీ ఆశించినంత స్థాయిలో రాకపోవడంతో జైలు అవసరాలకే వినియోగించారు. ఈ ఏడాది విరగ కాయడంతో వీటిని మార్కెట్లో విక్రయించేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సంగారెడ్డి జైలులో పండిన మామిడి పళ్లని పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లో పండించామని.. ఇవి వంద శాతం కార్బైడ్ ఫ్రీ అని చెబుతున్నారు జైల్ సూపరిండెంట్ సంతోష్ రాయ్. దశేరి, కేసర్, హిమసాగర్ వంటి వెరైటీలు ఇందులో ఉన్నాయని.. త్వరలో జైలు సమీపంలో, సమీప మార్కెట్లలో ఈ మామిడి పళ్లను అమ్మనున్నట్లు తెలిపారు. అమ్మకం ద్వారా వచ్చే సొమ్మును జైలు నిర్వహణకు ఉపయోగిస్తామని చెప్పారు. పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లో మామిడి పళ్ల సాగును ప్రోత్సహిస్తున్న జైలు అధికారులు, ఈ ఆలోచనకి ఉత్సాహంగా సహకరించి సాగు చేసిన ఖైదీలు నిజంగా అభినందనీయులు.